
ఓటమెరుగని ఆసీస్..
ఈ టోర్నీ గ్రూప్ దశలో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియానే గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో చూసుకున్నా.. ప్రత్యర్థిపై కంగారూ జట్టుదే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటివరకూ టీ20ల్లో ఒక్కసారి కూడా సౌతాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఆ మ్యాచ్‌లన్నీ టీ20 ప్రపంచకప్‌ల్లో భాగంగా జరిగినవే కావడం మరో విశేషం. వరుసగా ఏడో సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడబోతున్న ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది.
టీమిండియాతో సెమీస్‌లో తడబడ్డా చివరకు విజయాన్నందుకొని ఫైనల్ చేరింది. ఆఖరి బంతి వరకూ పట్టు వదలకుండా పోరాడే తత్వమే ఆ జట్టు అదనపు బలం. ఒత్తిడిని అధిగమిస్తూ ప్రత్యర్థిపై చెలరేగడం ఆసీస్‌కు వెన్నతో పెట్టిన విద్య. కెప్టెన్ మెగ్ లానింగ్‌తో పాటు అలీసా హీలీ, బెత్ మూనీ, ఆష్లీ గార్డెనర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గార్డెనర్ బంతితోనూ చెలరేగుతోంది. బౌలింగ్‌లో ఆమెతో పాటు మెగాన్ షట్, డార్సీ బ్రౌన్ సత్తా చాటుతున్నారు.

సమష్టిగా రాణిస్తే..
ఇంగ్లండ్‌పై సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరిన సౌతాఫ్రికా.. సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించగలదు. తొలి సెమీస్‌లో భారత్ చేసిన తప్పిదాలను చేయకుండా ఆసీస్‌ను కట్టడి చేస్తే ప్రపంచకప్ కలను సాకారం చేసుకోవచ్చు. గత 12 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా పురోగతి సాధిస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ సఫారీ అమ్మాయిలు సెమీస్ వరకూ వెళ్లారు.
లారా వోల్వార్ట్, తజ్మిన్ బ్రిట్స్ రూపంలో ఆ జట్టుకు డేంజరస్ ఓపెనర్లు ఉన్నారు. ఈ మెగా టోర్నీలోనే ఉత్తమ ఓపెనింగ్ జోడీ ఇదే. సెమీస్‌లో చెరో హాఫ్ సెంచరీ సాధించిన వీళ్లు సూపర్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆల్‌రౌండర్ మరిజేన్ కాప్ కూడా ఆ జట్టుకు కీలకం కానుంది. సెమీస్‌లో చెలరేగిన పేసర్లు షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగా ఖకా ఉత్సాహంగా ఉన్నారు. ఇక స్వదేశంలో అభిమానుల సమక్షంలో ఫైనల్ ఆడటం ఆ జట్టుకు కొండంత బలం.

ముఖా ముఖి పోరు..
తొలిసారి సౌతాఫ్రికా టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు జరగ్గా.. ఆరు మ్యాచ్‌లు ఆసీసే గెలిచింది. ఇవన్నీ టీ20 ప్రపంచకప్‌ల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లే కావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా ఏడోసారి ఫైనల్ చేరింది. అయిదు సార్లు కప్పు దక్కించుకున్న ఆ జట్టు.. ఓ సారి మాత్రం రన్నరప్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications












