మహిళల టీ20 ప్రపంచకప్ 2024ను ఓటమితో ప్రారంభించిన భారత మహిళల జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గ్రూప్-ఏలో భాగంగా జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది. 161 పరుగుల లక్ష్య చేధనలో అనూహ్యంగా 102 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. ఈ ఘోర ఓటమి టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. భారత్ రన్‌రేట్ -2.900 నెగటీవ్‌గా మారడంతో గ్రూప్-ఏలో అట్టడుగు స్థానంలో ఉంది.

డూ ఆర్ డై మ్యాచ్..
భారత్ సెమీస్ చేరాలంటే పాకిస్థాన్‌తో పాటు గ్రూప్-ఏలో ఉన్న ఇతర జట్లు శ్రీలంక, ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌లు గెలవడంతో పాటు మెరుగైన రన్‌రేట్ సాధించాలి. లేదంటే భారత్ కంటే మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతోంది. మెగా టోర్నీ రూల్స్ ప్రకారం ప్రతీ గ్రూప్ నుంచి రెండు జట్లు సెమీస్ చేరుతాయి.
గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశం ఉండగా.. మరో ప్లేస్ కోసం భారత్, శ్రీలంక, పాకిస్థాన్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్.. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తోనే తమ జైత్రయాత్రను కొనసాగించాల్సి ఉంటుంది.
దాయాదుల పోరుకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒత్తిడిని అధిగమించి హర్మన్ సేన ఆడాల్సి ఉంది. అయితే పాకిస్థాన్‌తో ముఖా ముఖి పోరులో భారత్ మహిళలదే పై చేయి. ఇరు జట్లు 15 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు విజయం సాధించింది. పాకిస్థాన్ మూడు సార్లు గెలిచింది. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆ జట్టును ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేమి కాదు. కానీ టీ20 ఫార్మాట్‌లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024కు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్స్‌తో పాటు తమ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించాలంటే రుసుము చెల్లించాలి. కానీ హాట్ స్టార్‌లో ఫ్రీగా చూడవచ్చు.