
మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు శుభారంభం చేసింది. దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన మిథాలీ సేన 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా పాకిస్థాన్‌పై ఉన్న రికార్డును మెరుగుపరుచుకుంది. వన్డేల్లో తాజా మ్యాచ్‌తో కలిపి పాక్ మహిళలతో తలపడ్డ 11 సార్లు భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది.
ఓపెనర్ స్మృతి మంధాన(75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 52, లోయరార్డర్ బ్యాటర్స్ పూజా వస్త్రాకర్(48 బంతుల్లో 4 ఫోర్లతో 53 నాటౌట్), స్నేహ్ రానా(59 బంతుల్లో 8 ఫోర్లతో 67), హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీప్తి శర్మ(40) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(9), హర్మన్ ప్రీత్ కౌర్(5), షెఫాలీ వర్మ(0) తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బైగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టగా.. నిదాదర్, నష్రా సంధు రెండేసి వికెట్లు తీసారు.
మిడిలార్డర్ ఘోర వైఫల్యంతో 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును లోయరార్డర్ బ్యాటర్స్ పూజా వస్త్రాకర్, స్నేహ్ రానా సూపర్ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 43 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టులో ఓపెనర్ సిద్రా అమీన్(64 బంతుల్లో 3 ఫోర్లతో 30), డియన బైగ్(35 బంతుల్లో 2 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వడ్ (4/31) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జూలన్ గోస్వామి(2/26), స్నేహ్ రాణా(2/27) రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘన సింగ్, దీప్తి శర్మకు తలో వికెట్ దక్కింది. సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించిన పూజా వస్త్రాకర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.