మహిళల ఆసియా కప్ 2023 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. యూఏఈతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 78 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 66), వికెట్ కీపర్ రిచా ఘోష్(29 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. ఓపెనర్ షెఫాలీ వర్మ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37) మెరుపు ఆరంభం అందించింది. టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఓటమిపాలైంది. అమెరికా జట్టులో ఈషా రోహిత్ ఓజా(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38), కవిషా(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, తనుజా కన్వర్, పుజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ స్మృతి మంధాన(13) వికెట్ కోల్పోయింది. స్మృతి ఔటైనా షెఫాలీ వర్మ దూకుడుగా ఆడింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన ఆమె కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన దయాలన్ హేమలత(2) క్లీన్ బౌల్డ్ అవ్వడంతో 52 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో జెమీమాతో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెలరేగింది. 54 పరుగులు జోడించిన అనంతరం జెమీమా(14) ఔటవ్వగా.. రిచా ఘోష్ సాయంతో హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. రిచా ఘోష్ వరుస బౌండరీలతో యూఏఈ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిచా ఘోష్ జట్టు స్కోర్‌ను 200 ధాటించింది.
చివరి ఓవర్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌటైనా.. పూజా వస్త్రాకర్ సాయంతో చివరి 5 బంతుల్లో 20 పరుగులు రాబట్టింది. చివరి 5 బంతులను వరుసగా బౌండరీకి తరలించింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తోనే అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది.