Womens Asia Cup Rising Stars: మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. పసికూన యూఏఈ చేతిలో రాధయాదవ్ సారథ్యంలోని భారత-ఏ జట్టు ఖంగుతిన్నది. దాంతో ఈ టోర్నీని ఘోర పరాజయంతో ప్రారంభించింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్-ఏ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషా ఒజా(72 నాటౌట్, 2/30) ఆల్‌రౌండ్ షోతో భారత్-ఏ పతనాన్ని శాసించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్- ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనుష్క శర్మ(45 బంతుల్లో 7 ఫోర్లతో 47), తనూజ కన్వార్(25 బంతుల్లో 5 ఫోర్లతో 34) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధాయాదవ్(7)తీవ్రంగా నిరాశపర్చింది. యూఏఈ బౌలర్లలో సమైరా ధరింధర్కా(3/40) మూడు వికెట్లు తీయగా.. వైష్ణవే మహేష్(2/13), ఇషా ఓజా(2/30) రెండేసి వికెట్లు పడగొట్టాడు. సురక్ష కొట్టే, అతిగే సిల్వా చెరో వికెట్ తీసారు.

అనంతరం యూఏఈ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఇషా ఓజా(61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది. సమైరా(31 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వార్ తలో వికెట్ తీసారు.
భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్(ఆదివారం), నేపాల్(మంగళవారం)తో తలపడనుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా రెండు గ్రూప్స్ విభజించారు. రెండు గ్రూప్స్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి. భారత్ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.