మహిళల ఆసియాకప్ 2024 టీ20 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా..ఫైనల్ దూసుకెళ్లింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సంచలన బౌలింగ్‌తో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులే చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా(51 బంతుల్లో 2 ఫోర్లతో 32), షోర్నా అక్తర్(18 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం భారత్ 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ(28 బంతుల్లో 2 ఫోర్లతో 26 నాటౌట్) ఆచితూచి ఆడగా.. స్మృతి మంధాన(39 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది.
నిప్పులు చెరిగిన రేణుకా సింగ్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు రేణుకా సింగ్ ఊహించని షాకిచ్చింది. వరుస ఓవర్లలో ఓపెనర్ దిలారా అక్తర్(6), ఇష్మా తంజిమ్(8), ముర్షిద ఖాటున్(4)ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసింది.
దాంతో బంగ్లాదేశ్ 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రేణుకా సింగ్‌కు తోడుగా రాధా యాదవ్.. రుమన అహ్మద్(1), నిగర్ సుల్తానా(32), నహిదా అక్తర్(0) ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
హ్యాట్రిక్ బౌండరీలతో..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. దూకుడుగా తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. షెఫాలీ వర్మ యాంకర్ రోల్ పోషించగా.. స్మృతి మంధాన వరుస బౌండరీలతో విరుచుకుపడింది. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె.. హ్యాట్రిక్ బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
స్మృతి మంధాన.. చివరి మూడు బంతులను వరుసగా బౌండరీలకు తరలించింది. దాంతో 54 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించిన రేణుకా సింగ్(3/10) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.