బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఆసియాకప్ 2024లో ఫైనల్ చేరామని టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులే చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా(51 బంతుల్లో 2 ఫోర్లతో 32), షోర్నా అక్తర్(18 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం భారత్ 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ(28 బంతుల్లో 2 ఫోర్లతో 26 నాటౌట్) ఆచితూచి ఆడగా.. స్మృతి మంధాన(39 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించింది. అసాధారణ బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయాన్నందించారని కొనియాడింది. 'మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. టీమ్ మీటింగ్స్‌లో మేం రచించిన వ్యూహాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేశారు. మా బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది.
ఈ మ్యాచ్‌లో మేం తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఆసియా క్రికెట్‌లో మేం పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాం. ఆ ఆధిపత్యాన్ని అలానే కొనసాగించాలనుకున్నాం. ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాం. దాంతో మెరుగ్గా రాణించగలిగాం. ప్రతీ రోజు బౌలర్లు పాజిటీవ్ అప్రోచ్‌తో సత్తా చాటుతున్నారు. సరైన లైన్ అండ్ లెంగ్త్స్‌లో బౌలింగ్ చేస్తున్నారు.
అద్భుత బౌలింగ్‌తో జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నారు. నిలకడగా రాణించడం మాకు చాలా ముఖ్యం. ఈ జోరును ఇలానే కొనసాగించాలి. పాకిస్థాన్, శ్రీలంక ఏ జట్టు ఫైనల్‌కు వచ్చినా మాకు ఎలాంటి సమస్య లేదు. ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమవుతాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.