మహిళల ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. రిచా ఘోష్(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించింది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది.
జెమీమా రోడ్రిగ్స్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) దూకుడుగా ఆడింది. షెఫాలీ వర్మ(16), ఉమ చెత్రీ(9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(11) తీవ్రంగా నిరాశపర్చడంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులే చేసింది. ఆ వెంటనే శ్రీలంక సారథి ఆటపట్టు.. తన ట్రంప్ కార్డ్ ఆఫ్ స్పిన్నర్ కవిష దిల్హారీని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టింది.
తన శైలికి భిన్నంగా ఆడుతూ అసౌకర్యంగా కనిపించిన షెఫాలీ వర్మను వికెట్ల ముందు బోల్తా కొట్టించింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఉమ చెత్రీని కెప్టెన్ ఆటపట్టు పెవిలియన్ చేర్చింది. బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్ సాయంతో స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసింది. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.
ఈ క్రమంలో 36 బంతుల్లో మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే నిసన్సాలా.. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమాతో కలిసి మంధానా దూకుడుగా ఆడింది. 41 పరుగుల స్వల్ప భాగస్వామ్యం అనంతరం జెమీమా రనౌటవ్వగా.. ఆ వెంటనే స్మృతి మంధానా భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్‌గా పెవిలియన్ చేరింది. ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 160 పరుగులు ధాటించింది.