
సిల్హెట్: మహిళల ఆసియాకప్ 2022 టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. శ్రీలంక మహిళల జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 41 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్(53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. బౌలింగ్‌లో హేమలత(3/15), దీప్తి శర్మ(2/15), పూజా వస్త్రాకర్(2/12) సత్తా చాటారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(6), షెఫాలీ వర్మ(10) విఫలమైనా.. క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. హర్మన్ ప్రీత్ ఔటైనా.. జెమీమా తన జోరును కొనసాగించింది. చేతి గాయంతో ఇంగ్లండ్ టూర్‌కు దూరమైన జెమీమా రొడ్రిగ్స్.. రీఎంట్రీలో తన ఫస్ట్ మ్యాచ్‌లోనే దుమ్మురేపింది. జెమీమా ధాటికి భారత్ భారీ స్కోర్ చేస్తుందనిపించింది. కానీ 18వ ఓవర్‌లో ఆటపట్టు ఆమె ఇన్నింగ్స్‌కు చెక్ పెట్టడంతో సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. హేమలత(13 నాటౌట్), దీప్తి శర్మ(1 నాటౌట్) అజేయంగా నిలవగా.. రిచా ఘోష్(9), పూజ వస్త్రాకర్(1) ధాటిగా ఆడలేకపోయారు. లంక బౌలర్లలో ఒశాడి మూడు వికెట్లు తీయగా.. కుమారి, ఆటపట్టు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకు కుప్పకూలింది. హసిని పెరెరా(30), హర్షిత సమర విక్రమ(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. పూజ, దీప్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. రాధా యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. భారత మహిళల జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను సోమవారం మలేషియాతో ఆడనుంది.