Womens World Cup 2022: భారత్‌ను ఓడించిన సౌతాఫ్రికాకు షాక్.. ఫైనల్లో ఇంగ్లండ్!

క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఫైనల్ చేరింది. టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడిన ఇంగ్లండ్.. ఆ తర్వాత నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది. వరుసగా 5 విజయాలు నమోదు చేసి ఆస్ట్రేలియా టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. సౌతాఫ్రికా మహిళలతో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్ణిగా రాణించిన ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. లీగ్ దశలో ఆధిపత్యం చెలాయించిన సౌతాఫ్రికా.. కీలక పోరులో మాత్రం చేతులెత్తేసింది. దాంతో సెమీస్ చేరకుండా ఇంటిదారిపట్టింది.

డానీ వ్యాట్ భారీ శతకం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 293 పరుగులు చేసింది. ఓపెనర్ డానీ వ్యాట్(125 బంతుల్లో 12 ఫోర్లతో 129) భారీ శతకంతో రాణించగా.. సోఫియా డంక్లీ(72 బంతుల్లో 4 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో మెరిసింది. చివర్లో సోఫీ ఇక్లీస్టోన్(11 బంతుల్లో 5 ఫోర్లతో 24) విలువైన పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మయిల్ మూడు వికెట్లు తీయగా.. మరజన్నే కాప్, మసబట క్లాస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అయబొంగా ఖాక ఓ వికెట్ తీసింది.

సోఫీ సిక్సర్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. లారా గుడాల్(28), మిగ్నోన్ డుప్రీజ్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఇక్లీస్టోన్ 6 వికెట్లతో సఫారీ అమ్మాయిల పతనాన్ని శాసించింది. అన్య శ్రుభ్‌సోల్ రెండు వికెట్లు తీయగా.. కేట్ క్రాస్, చార్లీ డీన్ తలో వికెట్ పడగొట్టారు. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అమ్మాయిలు భారత జట్టుపై విజయం సాధించారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ నోబాల్ కారణంగా సౌతాఫ్రికా విజయం సాధించింది. దాంతో మిథాలీ సేన టోర్నీ నుంచి నిష్క్రమించగా.. వెస్టిండీస్ సెమీస్ చేరింది.

ఆసీస్‌తో ఫైనల్..
వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 157 రన్స్ తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 305/3 భారీ స్కోర్ చేసింది. అలీసా హీలీ(129) భారీ సెంచరీ కొట్టగా.. రాచెల్ హేన్స్(85), బెత్ మూనీ(43 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ టార్గెట్ చేజింగ్‌లో విండీస్ 37 ఓవర్లలో 148 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్(48) టాప్ స్కోరర్. ఆదివారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications