Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's World Cup 2025: జెమీమా విజయ శతకం.. ఫైనల్ చేరిన భారత్!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌కు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు చేరువైంది. అసాధారణ ప్రదర్శనతో అద్వితీయమైన విజయంతో హర్మన్‌సేన ఫైనల్ చేరింది. గురువారం నవీ ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆసీస్‌ను ఓడించింది. జెమీమా అజేయ శతకంతో టీమిండియా విజయకేతనం ఎగరవేసింది. ఈ టోర్నీలో ఓటమెరుగని ఆసీస్‌కు పరాజయం రుచి చూపించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (93 బంతుల్లో 17 ఫఫోర్లు, 3 సిక్స్‌లతో 119) విధ్వంసకర శతకంతో చెలరేగగా ఎల్లిస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), అష్లే గార్డ్‌నర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి(2/49), దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్ చెరో వికెట్ తీసారు.

Women s World Cup 2025 Jemimah Rodrigues Unbeaten 127 Helps India Beat Australia to Reach Final

చరిత్ర సృష్టించిన భారత్

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 341 పరుగులు చేసి గెలుపొందింది. జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ కౌర్(88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్(2/46), అన్నబెల్ సదర్లాండ్(2/69) రెండేసి వికెట్లు తీసారు.

చెత్త ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియా విజయాన్ని చేజార్చుకుంది. జెమీమా ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌లను నేలపాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ గెలుపుతో టీమిండియా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.

నిరాశపర్చిన స్మృతి, షెఫాలీ

338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ప్రతికా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ(10)తీవ్రంగా నిరాశపర్చింది. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన షెఫాలీ వర్మ‌ను కిమ్ గర్త్ ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి జెమీమా రాగా.. స్మృతి మంధాన ఓ భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చింది. కానీ మంధానను కూడా కిమ్ గార్త్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. అంపైర్ నాటౌటివ్వగా.. రివ్యూతో ఆసీస్ ఫలితం రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 60 పరుగులే చేసింది.

ఆదుకున్న జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి జెమీమా చెలరేగింది. జెమీమా దూకుడుగా ఆడగా.. క్రీజులో సెట్ అయ్యేందుకు హర్మన్‌ప్రీత్ టైమ్ తీసుకుంది. 57 బంతుల్లో జెమీమా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝులిపించింది. బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం హర్మన్‌ మరింత దూకుడుగా ఆడింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడింది.

82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలనా కింగ్ బౌలింగ్‌లో జెమీమా ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ అలీసా హీలీ నేలపాలు చేసింది. ఈ అవకాశంతో జెమీమా చెలరేగింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం వేగంగా పరుగులు రాబట్టింది. సెంచరీ దిశగా సాగిన ఆమెను సదర్లాండ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

విజయ శతకం..

క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ కూడా దూకుడు ఆడింది. మూడు బౌండరీలతో జోరు కనబర్చింది. కానీ జెమీమా తప్పిదం కారణంగా ఆమె రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో క్రీజులోకి రిచా ఘోష్ రాగా.. జెమీమా తన క్లాస్ బ్యాటింగ్ కొనసాగించింది. మేఘన్ స్కట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. కానీ జెమీమా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. కనీసం బ్యాట్ కూడా ఎత్తలేదు. జట్టు విజయమే తన ముఖ్యమని భావించింది.

106 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో జెమీమా ఇచ్చిన మరో సునాయస క్యాచ్‌ను మెక్‌గ్రాత్ నేలపాలు చేసింది. రిచా ఘోష్ భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చింది. కానీ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అమన్ జోత్‌తో కలిసి జెమీమా విజయం కోసం పోరాడింది. చివర్లో అమన్ జోత్ కౌర్ రెండు బౌండరీలు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Thursday, October 30, 2025, 22:52 [IST]
Other articles published on Oct 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+