మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో మంగళవారం గువాహటి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 47 ఓవర్లకు కుదించి ఆడించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 47 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది.
దీప్తి శర్మ(53 బంతుల్లో 3 ఫోర్లతో 53), అమన్‌జోత్ కౌర్(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. హర్లీన్ డియోల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 48), ప్రతికా రావల్(59 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) పర్వాలేదనిపించారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(8), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(21) నిరాశపర్చారు. చివర్లో స్నేహ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించింది. శ్రీలంక బౌలర్లలో రణవీర(4/46) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబోధని(2/55) రెండు వికెట్లు పడగొట్టాడు. కులసూరియా, ఆటపట్టు చెరో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకు కుప్పకూలింది. చమరి ఆటపట్టు(47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), నిలాక్షి సిల్వా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/54) మూడు వికెట్లు తీయగా..స్నేహ్ రాణా(2/32), తెలుగు తేజం శ్రీ చరణి(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, ప్రతిక రావల్ తలో వికెట్ తీసారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మ(53, 3/54)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. భారత్ తన రెండో మ్యాచ్‌ను ఆదివారం(అక్టోబర్ 5) పాకిస్థాన్‌తో కొలంబో వేదికగా ఆడనుంది.