
షార్జా: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరుకుంది. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తవగా.. ప్లే ఆఫ్స్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు సిద్దమయ్యాయి. వీళ్ల పోరు మధ్యలో తమ సత్తా చూపెట్టడానికి ఇప్పుడు అమ్మాయిలు సిద్దమయ్యారు. అత్యుత్తమ భారత మహిళా క్రికెటర్లు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ల మేళవింపుతో క్రికెట్ అభిమానులను అలరించేందుకు టీ20 చాలెంజ్(మహిళల ఐపీఎల్) మూడో ఎడిషన్ సిద్ధమైంది.
షార్జా వేదికగా బుధవారం టోర్నీ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ ప్రభావంతో సుదీర్ఘ విరామం రాగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారి భారత ప్లేయర్లు మైదానంలోకి దిగనున్నారు. నాలుగు మ్యాచ్‌లు జరిగే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సూపర్‌నొవాస్, గతేడాది రన్నరప్ వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు టైటిళ్లను గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని నొవాస్ హ్యాట్రిక్‌పై కన్నేసింది.
తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని వెలాసిటీతో ఆ జట్టు బుధవారం తలపడనుంది. 16ఏళ్ల సంచలనం షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మిథాలీపైనే ఎక్కువగా వెలాసిటీ ఆధారపడి ఉంది. ఇక గత సీజన్‌లో హర్మన్ రెండు అర్ధశతకాలతో అదరగొట్టింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నీలో భారత్‌ను నడిపించిన హర్మన్ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 6 యావరేజ్‌తో చెత్త పెర్ఫామెన్స్ చేసింది. దాంతో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆ చేదు జ్ఞాపకం నుంచి బయపడి ఈ టోర్నీలో సత్తా చాటాలని కౌర్ కోరుకుంటోంది. మరోవైపు వెలాసిటీ గత సీజన్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్ ఈ టోర్నీలో ఎలా ఆడుతుందనదే ఆసక్తికరం. ఇక స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రైల్‌బ్లేజర్స్‌లో సీనియర్లు జులన్ గోస్వామి, ఎక్లెస్టోన్ లాంటి స్టార్లు ఉన్నారు.