ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. భారత్‌కే చెందిన కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరుగుతున్న ఈ ఫైనల్లో శనివారం జరిగిన తొలి గేమ్ డ్రాగా ముగిసింది. తెలుగు అమ్మాయి కోనేరు హంపి నల్లపావులతో ఆడగా.. దివ్య దేశ్‌ముఖ్ తెల్ల పావులతో ఆడింది.
ఈ క్లాసికల్ గేమ్స్‌లో ఈ భారత ప్లేయర్స్ విజయం కోసం హోరాహోరీగా తలపడ్డారు. అనుభవం కలిగిన కోనేరు హంపిని 18 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ పటిష్టమైన రక్షణతో నిలువరించింది. హంపి వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొని, గేమ్ డ్రా చేసుకుంది. గేమ్ చివరి వరకు ఇద్దరు ఆటగాళ్లు జాగ్రత్తగా తమ పావులను కదిపారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా.. ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడారు.
తొలి రౌండ్ డ్రాగా ముగియడంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఆదివారం రెండో గేమ్ జరగనుండగా.. ఇది కూడా డ్రా అయితే సోమవారం టై బ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా భారత్‌కు టైటిల్ సొంతమవుతుంది. టైటిల్ గెలిచిన ప్లేయర్ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కనున్నారు.

దివ్య దేశ్‌ముఖ్ సెమీఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్, చైనా ప్లేయర్ తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఆమె తన మొదటి గ్రాండ్ మాస్టర్ నార్మ్‌ను కూడా సాధించింది. మరోవైపు కోనేరు హంపి సైతం చైనాకు చెందిన లీ టింగీతో మరో సెమీఫైనల్ టైబ్రేక్‌లో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కోనేరు హంపి పట్టు వదలకుండా ఆడి విజయాన్నందుకుంది.