
రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడి కాంకషన్ తీసుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. అతని గైర్హాజరీతో ఇప్పటికే కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టినా.. బ్యాకప్ కీపర్‌గా తెలుగు కుర్రాడు, ఆంధ్ర రంజీ ప్లేయర్ కేఎస్ భరత్‌ను బీసీసీఐ పిలుపించింది. బోర్డు ఆదేశాలతో భరత్ గురువారమే టీమిండియాతో కలిసాడు. తుది జట్టులో ఆడే అవకాశం రాకున్నా.. సినీయర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూం పంచుకున్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లు ఇద్దరు ఇండియా -ఎ న్యూజిలాండ్ టూర్‌లో ఉండటంతో బోర్డు భరత్‌ను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేసింది.
26 ఏళ్ల భరత్ 74 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 37.66 సగటుతో 4143 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక భరత్‌కు బోర్డు నుంచి పిలుపు అందడం ఇదే మొదటిసారి కాదు. బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక డేనైట్ టెస్ట్‌కు భరత్ బ్యాకప్ కీపర్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఉన్నప్పటికీ.. బ్యాకప్ కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను వెస్టిండీస్ టూర్‌కు ముందు ప్రాక్టీస్ కోసం దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడించాలని బోర్డు భావించింది. దీంతో భరత్‌ను బ్యాకప్‌గా పిలిపించింది.
వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చూస్తూ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని ఫుల్ చేసేందుకు రిషబ్ పంత్ ప్రయత్నిచగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకుతూ నేరుగా అతడి హెల్మెట్‌ను బలంగా తాకి అనంతరం పాయింట్ దిశగా గాల్లోకి లేచింది. దీంతో.. ఫీల్డర్ టర్నర్ క్యాచ్ అందుకోగా.. రిషబ్ పంత్ నెమ్మదిగా పెవిలియన్‌కి నడుచుకుంటూ వెళ్లాడు. అయితే.. బంతి వేగంగా వెళ్లి హెల్మెట్‌ని తాకడంతో అతడి తల అదిరిందని గుర్తించిన వైద్యులు.. కొన్ని గంటలు పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. దీంతో.. మ్యాచ్‌లో కీపింగ్ బాధ్యతల్ని కేఎల్ రాహుల్ చూసుకోగా.. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మనీశ్ పాండే మైదానంలోకి వచ్చాడు.