టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూల్స్‌ను అతి క్రమించాడు. దాంతో అతనిపై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జడేజా.. బ్యాట్‌తో దుమ్మురేపాడు. తృటిలో శతకం చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి 6వ వికెట్‌కు 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు జడేజా.. జట్టు సభ్యులతో కాకుండా ఒంటరిగా ఎడ్జ్‌బాస్టన్ మైదానానికి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది బీసీసీఐ రూల్స్‌కు విరుద్దమని, అతనిపై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది.
జట్టులో స్టార్ కల్చర్‌కు తెరదించేందుకు బీసీసీఐ.. ఈ ఏడాది ఆరంభంలో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా 10 నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్స్ ప్రకారం భారత ఆటగాళ్లు మైదానానికి వెళ్లేటప్పుడు.. తిరిగి హోటల్‌కు వచ్చేటప్పుడు కలిసే రావాలని, ఒకే బస్సులో ప్రయాణించాలి. ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరగాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ ఆటగాడు కూడా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించకూడదని స్పష్టం చేసింది. అయితే రెండో రోజు ఆటలో మెరుగ్గా బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతో జడేజా.. అందరి కన్నా ముందే వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బౌన్సర్లను ఎదుర్కొన్నాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ అనుమతితోనే జడేజా స్టేడియానికి ఒంటరిగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతనిపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోనే అవకాశం లేదు.

రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన జడేజా.. రూల్స్ అతిక్రమించడంపై స్పందించాడు. 'నేను ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే బంతి ఇంకా కొత్తగా ఉంది. కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే.. తదుపరి ఆట సులువవుతుందని అనిపించింది. అదృష్టవశాత్తూ నేను లంచ్ బ్రేక్ వరకు బ్యాటింగ్ చేయగలిగాను. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్‌తో కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ కండిషన్స్‌లో ఎంత ఎక్కువ బ్యాటింగ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇంగ్లండ్ పిచ్‌ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ క్షణంలోనైనా బంతి స్వింగ్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవచ్చు. లేదా బౌల్డ్ కావచ్చు.
బ్యాట్‌తో జట్టుకు కావాల్సిన పరుగులు చేస్తే గొప్ప అనుభూతి కలుగుతోంది. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఆడుతున్నప్పుడు.. జట్టుకు మనం అవసరమైనప్పుడు రాణిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. 210/5 నుంచి జట్టును ముందుకు నడిపించడానికి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఒక సవాల్. ఈ సవాల్‌ను నేను స్వీకరించాను. ఎప్పుడైనా మీ కెప్టెన్‌కు అండగా నిలబడి భారీ భాగస్వామ్యంలో భాగమైతే.. క్రికెటర్‌గా.. బ్యాటర్‌గా మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా రాణించగలమనే నమ్మకం కలుగుతోంది.'అని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.