
కింగ్‌స్టన్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు సూపర్ బౌలింగ్‌తో పాక్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన విండీస్ వీరులు.. రెండో రోజు స్పూర్తిదాయకమైన బ్యాటింగ్‌తో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా విండీస్ ఓపెనర్, కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్(221 బంతుల్లో 12 ఫోర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వరుగా వికెట్లు పోతుంటే అతనొక్కడే పాక్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. మహమ్మద్ అబ్బాస్(3/21), షాహిన్ షా అఫ్రిది(2/59) ధాటికి 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ తీవ్ర కష్టల్లో పడింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాసన హోల్డర్(108 బంతుల్లో 10 ఫోర్లతో 58)తో కలిసి బ్రాత్ వైట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు 6వ వికెట్‌కు ఏకంగా 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత హోల్డర్‌ను అష్రఫ్ ఔట్ చేయగా.. జోషువా డ సిల్వా(20 బ్యాటింగ్)తో కలిసి బ్రాత్ వైట్ జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో అనవసర పరుగుకు ప్రయత్నించిన బ్రాత్ వైట్ రనౌట్‌గా వెనుదిరిగి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 87 ఓవర్లలో 8 వికెట్లకు 251 రన్స్ చేసింది. క్రీజులో జోషువాతో పాటు జోమల్ వారిక్కమ్(1 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 34 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్ ఆలమ్ (56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... అష్రఫ్ (44; 8 ఫోర్లు), బాబర్ ఆజమ్ (30; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, హోల్డర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. సాధ్యమైనన్ని పరుగులు చేసి ఆధిక్యాన్ని అందుకుంటే విండీస్ పై చేయి సాధించవచ్చు. మూడో రోజు బౌలింగ్‌లో పాక్ పని పడితే విండీస్ వీరుల విజయం నల్లేరు మీద నడకే అవుతోంది.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 217 ఆలౌట్(ఫవాద్ ఆలమ్ 56, అఫ్రఫ్ 44, హోల్డర్ 3/26, జైడెన్ సీల్స్ 3/70)
వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్ 251/8 (బ్రాత్ వైట్ 97, హోల్డర్ 58,అబ్బాస్ 3/21, అఫ్రిది 2/59)