ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వెస్టిండీస్‌తో శనివారం అర్థరాత్రి జరిగిన తొలి టీ20లో సెంచరీ చేయడం ద్వారా ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ సాధించాడు. 53 బంతుల్లోనే శతకం సాధించి ఇంగ్లండ్‌కు 8 వికెట్ల విజయాన్ని అందించాడు.
తొలి బ్యాటర్‌గా..
ఇప్పటి వరకు 34 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఫిల్ సాల్ట్ మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 119. ఈ మూడు శతకాలను వెస్టిండీస్‌నే ఫిల్ సాల్ట్ నమోదు చేశాడు. గతేడాది డిసెంబర్ 16, డిసెంబర్ 19న వెస్టిండీస్‌పై ఫిల్ సాల్ట్ రెండు శతకాలు నమోదు చేయగా.. తాజా మ్యాచ్‌లో మరో సెంచరీ కొట్టాడు.

ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బ్యాటర్ ఇవిన్ లూయిస్.. టీ20ల్లో భారత్‌పై రెండేసి శతకాలు నమోదు చేశారు. యూఏఈ ప్లేయర్ మహ్మద్ వసీమ్(ఐర్లాండ్‌పై), సెర్బియా ప్లేయర్ లెస్లీ డన్చార్(బల్లేరియాపై) రెండేసి శతకాలు నమోదు చేశారు. ఒకే జట్టుపై మూడు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్ మాత్రం ఫిల్ సాల్ట్.
ఇంగ్లండ్ సునాయస విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), గుడకేష్ మోతీ(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), రోమారియో షెఫర్డ్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్(3/32) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 183 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఫిల్ సాల్ట్(54 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. జాకోబ్ బెతెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) అజే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్టిండీస్ బౌలర్లలో గుడకేష్, రోమారియో షెఫర్డ్ తలో వికెట్ తీసారు.
ఐపీఎల్ వేలంలో భారీ ధర..
ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడేవాడు. ఓపెనర్‌గా నరైన్‌తో కలిసి విధ్వంసకర ఆరంభాలు అందించేవాడు. కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్‌లో అతనికి చోటు దక్కలేదు. వేలంలో ఫిల్ సాల్ట్ భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. కేకేఆర్‌తో పాటు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు అతని కోసం పోటీ పడే అవకాశం ఉంది.