
షార్జా: 'గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుంది'అంటారు పెద్దలు. ఈ సామెత వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌కు సరిగ్గా సరిపోతుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న గ్రూప్-1 లీగ్ మ్యాచ్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రస్సెల్‌ను రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. ఒక్క బంతి కూడా ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. దాంతో వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది.
అసలేం జరిగిందంటే.. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో బంగ్లా బౌలర్ టస్కిన్ వేసిన నాలుగో బంతిని రోస్టెన్ చేజ్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. దాంతో బంతి బౌలర్ టస్కిన్ అహ్మద్ వైపు దూసుకురాగా.. అతను తెలివిగా కాలితో దానిని వికెట్ల వైపు మళ్లించాడు. దాంతో బంతి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది. అయితే పరుగు కోసం ముందుకు వచ్చిన రస్సెల్.. తేరుకోని క్రీజులోకి వెళ్లే లోపే బంతి వికెట్లను గిరాటేసింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. అంపైర్ ఎలాంటి సందేహం లేకుండా ఔట్ ఇచ్చాడు. ఈ ఊహించని ఘటనతో షాక్‌కు గురైన రస్సెల్(0) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాపం రస్సెల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. ఆ మరుసటి ఓవర్‌లో క్రిస్ గేల్(4) సైతం బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రన్ హెట్‌మైర్(9) సైతం దారుణంగా విఫలమయ్యాడు. దాంతో విండీస్ 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కీరన్ పోలార్డ్ సాయంతో రోస్టన్ చేజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ ఇద్దరు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితయ్యారు. దాంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న పొలార్డ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి రస్సెల్ రాగా అతన్ని దురదృష్టం వెంటాడింది. దాంతో విండీస్ 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(40) ధాటిగా ఆడాడు. నాలుగు భారీ సిక్సర్లు బాదిన అతను విండీస్ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.
అయితే అదే జోరులో షెరీఫుల్ ఇస్లామ్ వేసిన 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బాల్‌కు రోస్టన్ చేజ్(39) సైతం ఔటవ్వడంతో ఆ ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్ ఫస్ట్ బాల్‌కు బ్రావో ఔటవ్వగా.. రిటైర్ట్ ఔట్‌గా వెనుదిరిగిన పొలార్డ్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే తర్వాతి రెండు బంతులను జాసన్ హోల్డర్ భారీ సిక్స్‌లు బాదగా.. చివరి బంతిని పొలార్డ్ సిక్స్ బాది 142 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు.