వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అంపైర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో తొండాట ఆడుతున్నారని, మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని వెస్టిండీస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా అంపైర్లు నాలుగు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్‌స్టాక్ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
రెండు రోజుల ఆటలోనే అతను ఐదు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇందులో ఒకటి ఆస్ట్రేలియాకు నష్టం చేయగా.. మిగిలిన నాలుగు తప్పిదాలు వెస్టిండీస్ కొంపముంచాయి. థర్డ్ అంపైర్ కారణంగానే వెస్టిండీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో పిచ్ అయిందని తెలిపాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ ఎల్బీడబ్ల్యూ విషయంలోనూ ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాట్ సందర్భంగా రోస్టన్ ఛేజ్ ఎల్బీ విషయంలోనూ ఇలాంటి తప్పుడు నిర్ణయాన్నే ప్రకటించాడు. బంతి బ్యాట్‌కు తాకకున్నా తాకిందని నాటౌటిచ్చాడు.

రెండో ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ ఎల్బీ విషయంలోనూ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ అయిందని రోస్టన్ ఛేజ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. షై హోప్ క్యాచ్ విషయంలోనూ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించాడు. బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా.. తాకలేదని ఔటివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీతో పాటు ఇతర ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సామీ అయితే తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అడ్రియన్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాడా? లేక అంపైరింగ్ ఎలా చేయాలో తెలియదా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 190 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా..రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 92 పరుగులు చేసింది.