WI vs AUS: వెస్టిండీస్ కొంపముంచిన రస్సెల్.. ఎట్టకేలకు విజయం సాధించిన ఆసీస్!

గ్రాస్ ఇస్లెట్: వెస్టిండీస్ గడ్డపై వరుస పరాజయాలకు ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. ఆతిథ్య జట్టుతో బుధవారం అర్ధరాత్రి ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన నామమాత్రపు నాలుగో టీ20లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆసీస్ 4 వికెట్లతో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసింది.
కెప్టెన్ ఆరోన్ ఫించ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53), మిచెల్ మార్ష్(44 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో డాన్ క్రిస్టియన్ (14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. వెస్టిండీస్ బౌలర్లలో హైడెన్ వాల్ష్ మూడు వికెట్లు తీయగా.. ఒషానే థామస్, రస్సెల్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీశారు.

స్టార్క్ సూపర్ బౌలింగ్..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు లెండీ సిమ్మన్స్ ( 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72), ఎవిన్ లూయిస్ (14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) మంచి శుభారంభం ఇవ్వగా.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(1), కెప్టెన్ నికోలస్ పూరన్(16) నిరాశపరిచారు. చివర్లో ఫాబియన్ అలెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29) మెరుపులు మెరిపించడంతో విండీస్ విజయం ఖాయమనిపించింది. కానీ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ అత్యుత్సాహం.. మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగ్ వల్ల ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఫాబియన్ అలెన్ విధ్వంసం
విండీస్ విజయానికి చివరి 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మెరిడిత్ వేసిన 19వ ఓవర్లో ఫాబియన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు సిక్సర్లతో విరుచుకుపడగా.. రస్సెల్ ఓ సిక్సర్ బాదడంతో 25 రన్స్ వచ్చాయి. కానీ ఆ ఓవర్ చివరి బంతి ఫాబియన్ అలెన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 11 పరుగులు అవసరం. క్రీజుల విధ్వంసకర బ్యాట్స్‌మన్ రస్సెల్ ఉన్నాడు. దాంతో ఈ మ్యాచ్ కూడా విండీస్ గెలుస్తుందని అంతా భావించారు.

కొంపముంచిన రస్సెల్
కానీ స్టార్క్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి రస్సెల్ కట్టిడి చేశాడు. అతని బలహీనతపై దెబ్బ కొడుతూ కచ్చితమైన యార్కర్లు సంధించాడు. దాంతో ఐదు బంతులను వృథా చేసిన రస్సెల్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, రిలే మెరిడిత్ ఓ వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ షో కనబర్చిన మిచెల్ మార్ష్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నామమాత్రమైన ఐదో టీ 20 శనివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications