హైదరాబాద్: 'ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి'అనే సామెత వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఒక్కప్పుడు వెస్టిండీస్ పేరు చెబితేనే ప్రత్యర్థి ఆటగాళ్లు వణికిపోయేవారు. ఆ జట్టుకు గట్టి పోటీ ఇస్తేనే గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఓడిస్తే గొప్ప యోధులుగా కీర్తించేవాళ్లు. తమ ఆటతో వన్డే ప్రపంచకప్‌లో గొప్ప ప్రమాణాలు నెలకొల్పి.. ఆ టోర్నీకే వన్నె తెచ్చిన జట్టు.. ఇప్పుడు ఏకంగా ఆ టోర్నీకే దూరమైంది.
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో పసికూన స్కాట్‌లాండ్ చేతిలో ఓడి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. సోబర్స్, రిచర్డ్స్, లాయిడ్, గ్రీనిడ్జ్.. మార్షల్, హోల్డింగ్, రాబర్డ్స్, గార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో ఓ వెలుగు వెలిగిన వెస్టిండీస్ ఇప్పుడు పసికూనలతో గెలవలేని పరిస్థితి తెచ్చుకొని ప్రపంచకప్‌కు దూరమైంది.

వెస్టిండీస్‌కు ఈ పరిస్థితి రావడానికి స్వయంకృతమే ప్రధాన కారణం. దిగ్గజ ఆటగాళ్లు దూరమైన తర్వాత ఆ లోటును విండీస్ భర్తీ చేసుకోలేకపోయింది. 90వ దశకంలో ఆంబ్రోస్, వాల్ష్, లారా లాంటి మేటి ఆటగాళ్లున్నా.. సమష్టితత్వం కొరవడి విజయాలు సాధించలేకపోయింది. కానీ ఆ జట్టులో ఎప్పుడూ ప్రతిభావంతులకు లోటు లేదు. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ సహా ఎంతోమంది ప్రపంచ స్థాయి క్రికెటర్లు వచ్చారు.
వెస్టిండీస్‌కు నిలకడలేకపోయినా... ప్రమాదకర జట్టుగానే అందరూ పరిగణించేవాళ్లు. అప్పుడప్పుడూ ఆ జట్టు మేటి జట్లను ధీటుగా ఎదుర్కొని సంచలన విజయాలూ సాధించేది. అయితే జీతాలు, కాంట్రాక్టుల విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డుతో ఆటగాళ్ల గొడవ విండీస్ క్రికెట్‌ను మరింత కుదిపేసింది.
ఏళ్ల తరబడి సాగిన ఈ గొడవ.. ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఆటగాళ్లు దేశానికి ఆడటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మానేశారు.
అప్పుడే టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరగడం.. ప్రపంచవ్యాప్తంగా టీ20 టోర్నీలు పుట్టుకురావడం.. విండీస్‌ను మరింత దెబ్బతీసింది. ఫ్రాంచైజీ లీగ్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం రావడంతో జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్స్ వైపు ఆ జట్టు ఆటగాళ్లు మొగ్గు చూపారు. దాంతో విండీస్ జట్టుకు ఒక రూపు అంటూ లేకుండా పోయింది. జట్టులో ఎప్పుడు ఏ ఆటగాడుంటాడో.. కెప్టెన్ ఎప్పుడూ మారుతాడో తెలియని ఘోర పరిస్థితి నెలకొంది.

ఇలాంటి ప్రతికూలతల మధ్య కూడా విండీస్ సంచలన ఆటతో 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. ఈ విజయాలు కూడా ఆ జట్టును ట్రాక్‌లోకి తీసుకురాలేకపోయాయి. వెస్టిండీస్ క్రికెట్ ఆర్థిక సంక్షోభం కూడా జట్టు కష్టాలను రెండింతలు చేసింది.
లీగ్ క్రికెట్‌కు బాగా అలవాటైపోయిన ఆ జట్టు ఆటగాళ్లు.. ఎక్కువ సమయం క్రీజులో నిలవాల్సిన టెస్టులు, వన్డేల్లో తేలిపోవడం మొదలైంది. ఈ ఫార్మాట్లలో ప్రదర్శన అంతకంతకూ పడిపోయింది. ర్యాంకింగ్స్‌లో పతనం వల్ల 2023 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం కోల్పోయిన విండీస్.. ఇప్పుడు క్వాలిఫయర్‌లోనూ సత్తా చాటలేకపోయింది.
స్టార్ ఆటగాళ్లంతా జట్టును వదిలి ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుతుండటం కూడా విండీస్ ఓటమికి కారణమైంది. వెస్టిండీస్ ఇంతలా పతనమవడం చూసి 80వ దశకం అభిమానులు తల్లడిల్లుతున్నారు. నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరిని వెస్టిండీస్.. నెత్తురు కక్కుతూ నేలకు రాలిందని ప్రముఖ జర్నలిస్ట్, రచయిత ప్రసేన్ బెల్లంకొండ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.