శ్రీలంక పర్యటన అనంతరం టీమిండియా.. మరో 42 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. సెప్టెంబర్ 19న సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌తో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ను పున:ప్రారంభించనుంది. సాధారణంగా టీమిండియాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఒక సిరీస్‌కు మరొక సిరీస్‌కు మధ్య 10-15 రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది.
కానీ గత కొన్నేళ్లుగా ప్రతీ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో టీమిండియాకు సుదీర్ఘ విశ్రాంతి లభిస్తోంది. ఈసారి కూడా ఈ రెండు నెలల్లోనే 42 రోజుల విశ్రాంతి లభించింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం కుర్రాళ్లతో కూడిన భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీలంకలో పర్యటించింది.

42 రోజుల తర్వాత..
టీమిండియా తదుపరి మ్యాచ్‌ను 42 రోజుల తర్వాత ఆడనుంది. అయితే ప్రతీ ఏడాది ఈ రెండు నెలల్లో టీమిండియాకు లాంగ్ బ్రేక్ ఇవ్వడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఛాంపియన్స్ లీగ్ కోసం బీసీసీఐ.. ఈ రెండు నెలల మధ్య స్లాట్ కేటాయించింది. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు.. ఇతర లీగ్స్ బెస్ట్ టీమ్స్‌తో ఈ టోర్నీ జరిగేది.
2008 నుంచి 2014 వరుకు జరిగిన ఈ టోర్నీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ లీగ్ కోసం ఆగస్ట్, సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుండా బీసీసీఐ చూసుకునేది. ఛాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత కూడా బీసీసీఐ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
మినీ ఐపీఎల్ కోసం..
ఛాంపియన్స్ లీగ్ స్థానంలో మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లతో మినీ ఐపీఎల్ జరపాలని సమాలోచనలు చేస్తోంది. అందుకోసమే ఆగస్ట్-సెప్టెంబర్ విండోలో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయకుండా ఖాళీగా ఉంచుతోంది.
భవిష్యత్తులో మినీ ఐపీఎల్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య రెండు వారాల పాటు మినీ ఐపీఎల్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ఖాళీ విండోను బీసీసీఐ బ్యాకప్‌గా పెట్టుకుంది. కరోనా సమయంలో ఈ విండోలోనే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించింది.
భారత క్రికెట్‌కు ముప్పు..
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మినీ ఐపీఎల్ కూడా సూపర్ సక్సెస్ అవుతోంది. కానీ ఇది భారత క్రికెట్‌ను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే అభిమానులు.. భారత జట్టు కంటే ఆటగాళ్లనే ఎక్కువ అభిమానిస్తున్నారు. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్ల వ్యక్తిపూజ ఎక్కువైంది.
ఇది టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ అభిమాన ఆటగాడిని కాకుండా మరే ఇండియన్ ప్లేయర్‌కు ఇచ్చినా అతనిపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్యాను సొంత అభిమానులే గేలి చేశారు. భారత క్రికెట్ చరిత్రలోనే సొంత ఆటగాడిపై విమర్శలు గుప్పించడం, గేలి చేయడం ఇదే తొలిసారి.