టీమిండియా మాజీ హెడ్ కోచ్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్ 19 జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో పాటు రెండు 4 రోజుల టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో బరిలోకి దిగే అండర్ 19 భారత జట్టును భారత జూనియర్ సెలెక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.
పుదుచ్చేరి వేదికగా వన్డే సిరీస్, చెన్నై వేదికగా మల్టీడే మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. గత కొంత కాలంగా సమిత్ ద్రవిడ్.. అండర్ 19 దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. దిగ్గజ ఆటగాడైన రాహుల్ ద్రవిడ్ తనయుడు కావడంతో సమిత్ ద్రవిడ్‌పై అందరి దృష్టి నెలకొంది.

ఆస్ట్రేలియాతో అండర్ 19 అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. సమిత్ ద్రవిడ్ అండర్ 19 ప్రపంచకప్ ఆడలేడు. ఎందుకంటే వచ్చే ఏడాది న్యూజిలాండ్, నమీబియా వేదికగా అండర్ 19 ప్రపంచకప్ 2026 జరగనుంది. అప్పటికి సమిత్ ద్రవిడ్ 20వ ఏట అడుగుపెడుతాడు. టోర్నీ రూల్స్ ప్రకారం అతను అండర్ 19 ప్రపంచకప్ ఆడేందుకు అనర్హుడవుతాడు. 2005లో నవంబర్ 10 సమిత్ ద్రవిడ్ జన్మించాడు.
ఇక భారత అండర్ 19 జట్టు తరఫున ఆడేందుకు తాను తీవ్రంగా శ్రమించానని స్టార్ స్పోర్ట్స్ కన్నడ చానెల్‌తో సమిత్ ద్రవిడ్ అన్నాడు. 'భారత అండర్ 19 జట్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. గొప్ప అనుభూతి కలిగింది. ఈ క్షణం కోసం నేను ఎంతో కష్టపడ్డాను'అని తెలిపాడు.
కాగా, సమిత్ ద్రవిడ్ మిడిలార్డర్ బ్యాటర్. ఇటీవల సీనియర్ మెన్స్ టీ20 టోర్నమెంట్ అయిన మహారాజ టీ20 ట్రోఫీలో పాల్గొన్నాడు. మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 114 స్ట్రైక్‌రేటుతో 82 పరుగులు చేశాడు. గుల్బార్గ్ మైస్టిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లతో పాటు ఓ సిక్స్ ఉంది. ఇదే ఈ టోర్నీలో అతని అత్యధిక స్కోర్.