నేనేమి చేశాను పాపం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు సూపర్ కెప్టెన్సీతో ఆర్‌సీబీని విజేతగా నిలబెట్టినా.. వరుసగా రెండో టైటిల్ అందించినా రజత్ పాటిదార్‌ను బీసీసీఐ సెలెక్టర్లు పట్టించుకోలేదు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనతో పాటు ఆసియా గేమ్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోకి రజత్ పాటిదార్‌ను తీసుకోలేదు. శనివారం నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సూర్యపై వేటు..
పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసిన సెలెక్షన్ కమిటీ అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త సారథిగా ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్‌గా తెలుగు తేజం తిలక్ వర్మను నియమించింది. ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం కల్పించింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో మొత్తం ఐదుగురు ఆటగాళ్లు ఉద్వాసనకు గురయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వగా.. రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌పై వేటు పడింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
రెండు టైటిళ్లు గెలిచినా..
రజత్ పాటిదార్‌ను పరిగణలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరుసగా రెండు సీజన్లలో రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుసగా రెండు సీజన్లలో జట్టును విజేతగా నిలబెట్టడంతో రజత్ పాటిదార్‌కు టీమిండియా పిలుపు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతని ఊసే తీయలేదు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో 191 స్ట్రైక్‌రేట్‌తో 501 పరుగులు చేసిన రజత్ పాటిదార్... 30 ఫోర్లు, 42 సిక్సర్లు బాదాడు. డేంజరస్ మిడిలార్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా 7 నుంచి 11 ఓవర్ల మధ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డెత్ ఓవర్లలోనూ సత్తా చాటాడు. ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో చాలా మంది రజత్ పాటిదార్ కంటే తక్కువ పరుగులు చేసినవారే. కానీ 33 ఏళ్ల వయసు అనే ఒకే ఒక్క కారణంతో రజత్ పాటిదార్‌ను సెలెక్టర్లు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
ఏం పాపం చేశాడు..
వయసు ముఖ్యం కాదని చాలా మంది ఆటగాళ్లు నిరూపించినా.. భారత సెలెక్టర్లు మాత్రం ఏజ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అద్భుతమైన లీడర్‌షిప్ స్కిల్స్, స్పిన్నర్లను చితక్కొట్టే సామర్థ్యం ఉన్నా.. రజత్ పాటిదార్‌ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ ప్రదర్శనకు ప్రాధాన్యత ఇచ్చే సెలెక్టర్లు రజత్ పాటిదార్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రజత్ పాటిదార్ ఏ పాపం చేశాడని నిలదీస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications