న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా ఫిట్‌నెస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 23 ఏళ్లకే ఆ పొట్ట.. బట్ట ఏంది? అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అతని తాజా ఫొటోలో కెరీర్ చరమాంకంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. నెత్తిన జుత్తు మొత్తం ఊడిపోవడం వల్ల పెద్ద వయస్కుడిలా దర్శనమిస్తున్నాడు.
బాగా బరువు పెరిగి శరీరం మీద ఏమాత్రం అదుపు లేని వాడిలా కనిపిస్తున్నాడు. తోటి యువ ఆటగాళ్లు కండలు తిరిగిన దేహంతో ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ టీమిండియాకు ఆడుతుంటే పృథ్వీ షా మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ప్రతిభకు లోటు లేని పృథ్వీ చేజేతులా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.

అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లోకి తార జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా.. విరాట్ కోహ్లీని తలపించాడు. కానీ అంతే వేగంగా భారత జట్టుకు దూరమయ్యాడు. నాలుగేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పర్యవేక్షణలో కాస్త గారబంగా పెరిగాడు. కానీ ఆటపై మక్కువతో తండ్రి కలను నెరవేర్చాడు. అసాధారణ ఆటతీరుతో 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ బాది యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌డమ్.. తల్లి లేకపోవడం పృథ్వీ షాను తప్పటడుగులు వేసేలా చేసింది. ఈ తప్పిదాలకు తోడు అతని విధి రాత కూడా పరీక్షగా నిలిచింది.

టెస్టు కెరీర్‌ను గొప్పగా ఆరంభించాక ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. తర్వాత నడుం దగ్గర అయిన మరో గాయం మరి కొంత కాలం ఆటకు దూరమయ్యేలా చేసింది. ఈలోపు ఫామ్ కూడా దెబ్బ తింది. దేశవాళీల్లోనే కాక ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణించలేకపోయాడు.
పేలవ ఫామ్‌కు తోడు వివాదాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. 19 ఏళ్ల వయసులో డోప్ పరీక్షలో దొరికిన అతను 8 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు. అవగాహన లేక దగ్గు మందు తీసుకోవడంతో పృథ్వీ షా డోప్ టెస్ట్‌లో దొరికిపోయాడు. అనంతరం రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా చెలరేగలేకపోయాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు.

అనంతరం కోలుకొని దేశవాళీలో సత్తా చాటిన అతన్ని ఓ ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌తో జరిగిన గొడవ మరో వివాదంలో నెట్టేసింది. చివరకు ఈ గొడవలో అతని తప్పు ఏం లేదని తేలినా పృథ్వీ షా మాత్రం తీవ్రంగా నష్టపోయాడు. ఈ గొడవ కారణంగా తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొన్న అతను ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. మరింత డిప్రెషన్‌లోకి పోయిన అతని ఫిట్‌నెస్ అదుపుతప్పింది.
అతణ్ని చూస్తే క్రికెట్ ఆడే ఫిట్‌నెస్ ఉందని అనిపించదు. ప్రస్తుతం ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా.. విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతను ఫిట్‌నెస్‌పై కాస్త ఫోకస్ పెట్టి ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడు. లేదంటే మరో వినోద్ కాంబ్లీలా చరిత్రలో మిగిలిపోతాడు.