టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం వెల్లడించింది. ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.
ఈ ప్రపంచకప్‌కు అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. జూన్ 1న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ ఈ ప్రపంచకప్‌తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

జట్టు ఎంపికలో ఎలాంటి సంచలనాలకు తావివ్వని బీసీసీఐ అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. అయితే విధ్వంసకర ఫినిషర్ రింకూ సింగ్, స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లను స్టాండ్‌బై లిస్ట్‌లో చేర్చింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను విస్మరించింది. గతేడాదిగా భారత టీ20 జట్టులో కొనసాగిన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్‌లను పక్కనపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ వల్లే..
అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రదర్శనే రింకూ సింగ్‌ను పక్కనపెట్టడానికి కారణమైనట్లు అర్థమవుతోంది. ఏ ఐపీఎల్ ప్రదర్శనతో అయితే భారత జట్టులోకి వచ్చాడో.. ఆ టోర్నీ వల్లే రింకూ సింగ్ గోల్డెన్ ఛాన్స్ చేజార్చుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ తరఫున రింకూ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చాడు.
ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలతోనే రింకూ సింగ్‌ను పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది. అయితే ఈ సీజన్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా పెద్దగా రాలేదనే విషయాన్ని సెలెక్టర్లు గుర్తించలేదు. 9 మ్యాచ్‌ల్లో అతను 82 బంతులు మాత్రమే ఆడాడు. అంతేకాకుండా ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్ సూపర్ బ్యాటింగ్‌తో రింకూ సింగ్ ఆడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.

శివమ్ దూబే..
అంతేకాకుండా శివమ్ దూబే సూపర్ ప్రదర్శన కూడా రింకూ సింగ్ ఎంపికను అడ్డుకున్నట్లు అర్థమవుతోంది. సీఎస్‌కే తరఫున ఫినిషర్‌గా ఆడుతున్న దూబే సంచలన బ్యాటింగ్‌తో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన శివమ్ దూబేనే సెలెక్టర్లు సరైన ఫినిషర్‌గా భావించి ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది.
రింకూ సింగ్‌ను పక్కనపెట్టడాన్ని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న అతను టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి తుది జట్టులోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
స్టాంబ్‌బై ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్