టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆసియా కప్ 2025 జట్టుకు ఎంపిక చేసిన జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించినా అయ్యర్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు.
ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు లేదని, అతని కోసం ఎవర్నీ తప్పించాలో చెప్పాలని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. టీ20ల్లో చోటు కోసం అతను ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. అయితే సెలెక్టర్ల నిర్ణయాన్ని మెజార్టీ అభిమానులు తప్పుబడుతున్నారు. మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టడం ఏంటని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ సాబ్‌కే జట్టులో చోటు లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్‌ను అభిమానులు ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటారు. అయితే అతనికి ఈ పేరు ఎలా వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అయ్యర్ కెరీర్‌లో ఇదో మిస్టరీగా మారింది. సర్పంచ్ సాబ్ అనే బిరుదు వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం.

ఓ వైరల్ వీడియో నుంచి శ్రేయస్ అయ్యర్‌కు ఈ నిక్‌నేమ్ వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా.. ఓ పల్లెటూరు కుర్రాడు.. క్రికెట్ రిపోర్టర్‌తో మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ అంటే తనకు చాలా ఇష్టమని, అతన్ని తాము సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటామని చెప్పాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అతను అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో అతని సారథ్యాన్ని కొనియాడే క్రమంలో సదరు కుర్రాడు సర్పంచ్ సాబ్ అనే పదాన్ని ఉపయోగించాడు.
సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు. గొప్ప నాయకుడని అర్థం. పంజాబ్ కింగ్స్‌ను సమర్థవంతంగా నడిపించడంతో అయ్యర్‌ను ఆ కుర్రాడు సర్పంచ్ సాబ్ అని పిలిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ పేరును పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అయ్యర్‌కు బిరుదుగా ఉపయోగించారు. దాంతో ఈ నిక్‌నేమ్‌కు ప్రాచూర్యం లభించింది. దాంతో అందరూ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని పిలవడం మొదలు పెట్టారు.
సర్పంచ్ సాబ్ బిరుదు ఎలా వచ్చిందో తనకు తెలియదని అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా పంజాబ్ కో ఓనర్ ప్రీతీ జింటాతో మాట్లాడుతూ ఈ పేరు గురించి అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సర్పంచ్ సాబ్ అనే ట్యాగ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఈ ట్యాగ్ ఇచ్చిందనుకుంటున్నా. పంజాబ్‌లో నేను ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను సర్పంచ్ సాబ్ అని పిలుస్తున్నారు.'అని అయ్యర్ తెలిపాడు.