For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్‌కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా అతని కోసమే మ్యాచ్‌లు చూసేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో స్టేడియాలన్నీ పసుపుమయం అవుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ధోనీ.

చివరి సీజన్ ఆడుతున్నాడే ప్రచారంతో అభిమానులు అతని ఆటను చూసేందుకు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం మ్యాచ్ టికెట్ల కోసం ఫ్రాంచైజీ ఓనర్లను, క్రికెట్ అసోసియేషన్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. అంత క్రేజ్ కలిగిన ధోనీ కెమెరా ముందు ఏడ్చిన సందర్భాలు అత్యంత అరుదు.

Why CSK Was Banned For 2 Years in IPL

ధోనీ ఫిక్సింగ్ చేశాడా..?
అయితే చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండేళ్ల పాటు నిషేధం పడినప్పుడు ధోనీ కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటం అంటే హత్య చేసిన నేరం కంటే చాలా పెద్దదని కూడా ధోనీ అభిప్రాయపడ్డాడు. అలాంటిది ధోనీ కెప్టెన్‌గా ఉన్న సీఎస్‌కేపై రెండేళ్ల పాటు నిషేధం పడింది.

2013 ఐపీఎల్ 66వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చౌహన్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు మూడు మ్యాచ్‌ల్లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో..
స్పాట్ ఫిక్సింగ్ అంటే పూర్తి మ్యాచ్ కాకుండా.. కొన్ని ఓవర్లను ఫిక్స్ చేయడం. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చౌహన్‌లు ఇతర దేశాలకు సంబంధించిన బుకీలతో ఫిక్సింగ్ చేసుకున్నారని, మ్యాచ్ ప్రారంభమవ్వకముందే ఓవర్‌కు ఇన్ని పరుగులు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తమ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌తో మీడియా ముందు ఈ వివరాలు బయట పెట్టింది. దాంతో భారత క్రికెట్‌లో ప్రకంపనలు రేగాయి. ఐపీఎల్‌పై అందరికి అనుమానాలు కలిగాయి. ఈ ముగ్గురి ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ చేయగా.. బీసీసీఐ నిషేధం విధించింది.

Why CSK Was Banned For 2 Years in IPL

సీఎస్‌కే కీలక వ్యక్తి అరెస్ట్..
ఈ ముగ్గురి ఆటగాళ్లతో పాటు 13 మంది బుకీలను కూడా పోలీసులు అప్పట్లో అరెస్ట్‌ చేశారు. వీరిలో శ్రీశాంత్ దగ్గరి బంధువు కూడా ఉన్నారు. వీరిని విచారించగా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో కీలక వ్యక్తి అయిన గురునాథ్ మెయప్పన్ పేరు కూడా బయటకు వచ్చింది.

గురునాథ్ మెయప్పన్ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్, సీఎస్‌కే ఓనర్ అయిన ఎన్ శ్రీనివాసన్‌కు అల్లుడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో గురునాథ్ మెయప్పన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఏ టీమ్ వ్యక్తి అయినా బుకీలతో సంబంధం పెట్టుకొని, అరెస్ట్ అయితే ఆ టీమ్‌ను సస్పెండ్ చేసే అధికారం బీసీసీఐకి ఉంటుంది.

స్పెషల్ కమిటీకి కేసు..
బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మెయప్పన్ కేసుపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ కేసు నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఎన్ శ్రీనివాసన్ తప్పుకోగా.. జగన్‌మోహన్ దాల్మియాను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ రాజ్‌కుంద్రాను కూడా పోలీసులు ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేశారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పగించింది. విచారణ కోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో మెయప్పన్‌ను నేరస్థుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నేరస్థులను శిక్షించేందుకు సుప్రీం నియమించిన లోధా కమిటీ.. ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ ప్రకారం ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లకు సంబంధించిన టీమ్స్‌పై నిషేధం విధించాలని ఆదేశించింది.

దాంతో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఆటగాళ్లకు సంబంధం లేకున్నా టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న వ్యక్తులు బుకీలతో సంబంధాలు పెట్టుకోవడంతో సీఎస్‌కే, ఆర్‌ఆర్ జట్లు నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది.

Story first published: Thursday, April 18, 2024, 17:51 [IST]
Other articles published on Apr 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+