ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన 1000వ ఐపీఎల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. తొలి మూడు బంతులనే టీమ్ డేవిడ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 నాటౌట్) హ్యాట్రిక్ సిక్స్‌లుగా మలిచి చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో యశస్వీ జైస్వాల్ శతకం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లతో 124 )సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా.. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు, పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, రిలే మెరిడిత్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 214 పరుగులు చేసి మరో 3 బంతులు ఉండగానే గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. బర్త్‌డే బాయ్, కెప్టెన్ రోహిత్ శర్మ(3).. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 బంతులు మాత్రమే ఆడి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఇషాన్ కిషన్ ధాటిగా ఆడటంతో ముంబై.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం సంజూ శాంసన్.. అశ్విన్‌ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. ఇషాన్ కిషన్(28)ను అశ్విన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కామెరూన్ గ్రీన్‌ను కూడా అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. గ్రీన్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సూర్య చెలరేగాడు.
తనకే సాధ్యమైన స్వీప్ షాట్లతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న సూర్య.. జట్టును విజయం దిశగా నడిపాడు. కానీ సూర్య ఇగోను టచ్ చేస్తూ ఫీల్డ్ సెట్ చేసిన సంజూ శాంసన్ అతనికి ఉచ్చును బిగించాడు. ఇది గ్రహించని సూర్య.. భారీ షాట్‌కు ప్రయత్నించి సందీప్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.
బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ డేవిడ్‌తో కలిసి తిలక్ వర్మ విజయం కోసం పోరాడాడు. ఈ ఇద్దరూ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించడంతో ముంబై విజయానికి చివరి 12 బంతుల్లో 32 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన సందీప్ శర్మ 15 పరుగులు ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమయ్యాయి. జాసన్ హోల్డర్ వేసిన చివరి ఓవర్‌లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది విజయాన్నందించాడు.