ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత జట్టు పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీ కోసం తాము పాకిస్థాన్‌లో పర్యటించలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని కోరింది.
దుబాయ్ లేదా శ్రీలంకలో తమ మ్యాచ్‌లు జరపాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒప్పుకోవడం లేదు. 2008లో చివరిసారిగా పాకిస్థాన్‌లో భారత్ పర్యటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి.

అప్పటి నుంచి ఇరు దేశాలు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ బరిలోకి దిగింది. కానీ భారత జట్టు మాత్రం తమ ఆటగాళ్లకు సరైన భద్రత లభించదని పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు.
అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా పాక్‌లో పర్యటించేందుకు అనుమతివ్వలేదు. దాంతోనే పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2023లో తమ మ్యాచ్‌లను భారత్ తటస్థ వేదికగా ఆడింది. ఈ టోర్నీని పీసీబీ అధికారులు హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించారు. శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్‌లను నిర్వహించిన పీసీబీ.. మిగతా మ్యాచ్‌లను పాక్‌లో జరిపింది.
ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇదే పద్దతిలో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతోంది. ఒకవేళ టీమిండియా డిమాండ్‌కు ఐసీసీ ఒప్పుకోకపోతే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే పరిస్థితి ఏందనే సందేహం అభిమానులకు కలుగుతోంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా తప్పుకుంటే శ్రీలంక అర్హత సాధిస్తోంది.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించగా.. 9వ స్థానంలో నిలిచిన శ్రీలంకకు చోటు దక్కలేదు. దాంతో 2002 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత అయిన శ్రీలంక క్వాలిఫై కాలేదు. ఈ క్రమంలోనే భారత్ తప్పుకుంటే శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. అయితే భారత్‌ను కాదని ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ధైర్యం చేయదు.
మరోవైపు భారత ప్రభుత్వం అనుమతి లేనిదే టీమిండియా.. పాకిస్థాన్‌లో పర్యటించలేదు. టోర్నీ సక్సెస్ కావాలంటే పాకిస్థాన్ తలొగ్గాల్సిన అవసరం నెలకొంది.