టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగనుండటం పెను సంచలనం సృష్టించింది. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. ఇంత తక్కువ సమయంలో మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించడం కుదరదని, భారత్‌లోనే ఆడాలని స్పష్టం చేసింది. దాంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
నిబంధనల ప్రకారం తదుపరి ర్యాంక్‌లో ఉన్న స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. ఓవైపు ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతుండగానే.. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త డ్రామాకు తెరలేపింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తమ భాగస్వామ్యంపై పీసీబీ ఛైర్మన్ మొహ్‌సిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనాలా? వద్దా? అనేది తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపాడు.'ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రపంచకప్ ఆడొద్దని చెబితే.. ఐసీసీ మా జట్టు స్థానంలో మరో జట్టుకు అవకాశం కల్పించవచ్చు. మా ప్రధాన మంత్రి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.'అని పేర్కొన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటే వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే అంశంత తీవ్ర చర్చనీయాంశమైంది. ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్థాన్ వైదొలిగితే వారి స్థానంలో ఉగాండా బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసిన ర్యాంకింగ్ విధానాన్నే వర్తింప జేయనున్నారు.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించని జట్లలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానంలో ఉన్న జట్టుకు అవకాశం దక్కుతుంది. స్కాట్లాండ్ (14వ ర్యాంక్) ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేయడంతో.. తర్వాతి స్థానంలో ఉన్న ఉగాండా (21వ ర్యాంక్) రేసులో ముందుంది.
గ్రూప్ సమీకరణాలు: ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, గ్రూప్ Aలో (భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్న గ్రూప్) వారి స్థానాన్ని ఉగాండా భర్తీ చేస్తుంది.
ఆర్థిక నష్టం: టోర్నీ నుంచి తప్పుకుంటే పాకిస్థాన్ సుమారు 500,000 డాలర్ల (సుమారు ₹4.2 కోట్లు) పార్టిసిపేషన్ ఫీజును కోల్పోవాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఉగాండా, పాపువా న్యూ గినియా, కువైట్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి పాకిస్థాన్ అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ.. ఐసీసీ బ్యాకప్ ప్లాన్ సిద్దం చేసుకుంది. పాక్ వైదొలిగితే.. ఉగాండా బరిలోకి దిగుతుంది. అదే జరిగితే టోర్నీలో అసలు సిసలు మజా మిస్సవ్వనుంది.