
బాప్‌రే.. నటరాజన్..
ముఖ్యంగా 14, 18వ ఓవర్లలో అతను చేసిన బౌలింగ్ బాప్‌రే అనిపించింది. ఈ రెండు ఓవర్లలో 12 బంతుల్లో దాదాపు 10 యార్కర్లే. అవీ కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా. అతని బౌలింగ్‌కు కామెంటేటర్లు, విశ్లేషకులు నోరేళ్లబెట్టారు. రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, హెట్‌మైయిర్ వంటి విధ్వంసకర బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
అత్యంత కచ్చితత్వంతో యార్కర్లను సంధించాడు. తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే భీభత్సం సృష్టించి విజయంలో కీలక పాత్ర పోషించిన స్టోయినీస్‌ను అడ్డుకోవడం మాములు విషయం కాదు. అందులోనూ అతడిని వికెట్ల ముందు బోల్తాకొట్టించి తన బౌలింగ్ పవర్‌ను తెలియజేశాడు. అతను ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే.. నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో 8 డాట్స్ ఉండగా రెండే ఫోర్లు ఉన్నాయి. ఈ బౌలింగ్‌తోనే నటరాజన్ ఈ రోజు అందరి నోట నానుతున్నాడు. దిగ్గజాల చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు.

సన్నాఫ్ డైలీ లేబర్
ఇక ఇంతటి ప్రతిభ ఉన్న నటరాజన్ అందరి క్రికెటర్లలా సంపన్నుడు కాదు. అతను ఈ స్థాయికి ఊరికే చేరుకోలేదు. అతడి ఎదుగుదల వెనక పుట్టెడు దు:ఖం ఉంది. కటిక పేదరికం, కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. తమిళనాడు సేలం జిల్లాలోని చిన్నప్పంపట్టి అనే కుగ్రామం నుంచి తంగరసు నటరాజన్ తారజువ్వాలా దూసుకు వచ్చాడు. అతడి తండ్రి డైలీ లేబర్. తల్లి మాంసం, కూరగాయల విక్రేత. చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే ఇష్టం. సరదాగా స్నేహితులతో కలిసి ఆడేవాడు. మనలానే టెన్నిస్ బంతితో ఆడేవాడు.
అలా ఆ బంతితో యార్కర్లు వేయడంలో ఆరితేరాడు. చిన్నచిన్న టోర్నీల్లో ఆడుతూ తన జట్టును గెలిపిస్తుండేవాడు. అలా చెన్నై క్రికెట్ ఆడే జయ ప్రకాశ్ కంటపడ్డాడు. ఆయన నటరాజన్ తల్లిదండ్రుల్ని ఒప్పించి అతడిని చెన్నై తీసుకెళ్లాడు. ఆయా క్లబ్బుల్లో ఆడేలా చేశాడు. అపార ప్రతిభ ఉన్న నటరాజన్ కూడా వెనక్కు చూసుకోకుండా దూసుకెళ్లాడు.
వేలంలో రూ.3 కోట్లు
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన నటరాజన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అప్పటి వరకు డబ్బే అవసరంగా బతికిన అతనికి ఒక్కసారిగా భారీ మొత్తంలో రావడంతో తెగ ఆనందపడ్డాడు. కానీ భాషా సమస్యవల్ల ఇతర ఆటగాళ్లను కమ్యూనికేట్ చేయలేక నటరాజన్ ఇబ్బంది పడ్డాడు. 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్‌లో ఆ ఫ్రాంచైజీ అతడిని వదిలేసింది. అయితే టీఎన్‌పీఎల్‌లో అతడి ప్రతిభను గమనించిన సన్‌రైజర్స్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ 2018 వేలంలో రూ.40 లక్షలకు హైదరాబాద్ కొనుగోలు చేసేలా కృషిచేశాడు. పూర్తిగా బౌలర్లతో ఉండే హైదరాబాద్‌లో అతనికి అవకాశాలు రాలేదు. 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టి హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కృతజ్ఞతగా జెర్సీపై పేరు..
క్రికెట్ ద్వారా తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగైంది. తన జీవితాన్ని మలుపుతిప్పిన జయప్రకాశ్‌కు కృతజ్ఞతా భావంతో తన జెర్సీ వెనక 'జేపీ' పేరును చేర్చుకున్నాడు. అందుకే అతడి జెర్సీపై 'జేపీ నటరాజన్' అని రాసుంటుంది. అయితే పేదరికం అనుభవించినప్పుడు నేర్చుకున్న ఆర్థిక పాఠాలను నటరాజన్ ఇప్పటికీ అమలు చేస్తున్నాడు. తన సొంతగ్రామంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసి 60 మంది పేద పిల్లలకు ఉచితంగా క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. క్లబ్ స్థాయిలో 6 బంతులకు 6 యార్కర్లు వేసిన అనుభవం ఉన్న నటరాజన్ ఇదే జోరు కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు అతని కెరీర్‌కు తిరుగుండదు. ఇదే కచ్చితమైన యార్కర్లను విసరగలిగితే టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ధోనీ ఓ దిగ్గజం.. అతనిలా ఎవరూ ఆడలేరు.. పోలిక వద్దు: సంజూ శాంసన్


Click it and Unblock the Notifications
