టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా దేశవాళీ దిగ్గజం, భారత్-ఏ హెడ్ కోచ్ సితాన్షు కోటక్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బ్యాటింగ్ కోచ్‌ను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. బ్యాటింగ్‌కు స్పెషలిస్ట్ కోచ్‌ను నియమిస్తేనే టీమిండియా వరుస వైఫల్యాలకు బ్రేక్ పడుతుందనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.
ఎవరీ సితాన్షు కోటక్..?
దేశవాళీ క్రికెట్ దిగ్గజమైన సితాన్షు కోటక్ పేరును ఖరారు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాపేర్కొంది. సితాన్షు కోటక్ గతంలో టీమిండియాకు తాత్కలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా.. ఆ సమయంలో సితాన్షు కోటక్ తాత్కలిక హెడ్ కోచ్‌గా పనిచేశారు.

గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. 1992-93 వరకు సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన 53 ఏళ్ల సితాన్షు.. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 8061 పరుగులు చేశాడు. ఇందులో 15 శతకాలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ యావరేజ్ 41.76 ఉండటం విశేషం.
కోచ్‌గా రెండో ఇన్నింగ్స్..
సౌరాష్ట్ర జట్టుకు సారథిగా వ్యవహరించిన సితాన్షు కోటక్.. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. సౌరాష్ట్ర హెడ్ కోచ్‌గా పనిచేసిన అతను అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా చేరాడు. గత నాలుగేళ్లుగా ఇండియా-ఏ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో భారత్-ఏ జట్టును పర్యవేక్షించాడు. ఐపీఎల్ 2017లో గుజరాత్ లయన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గానూ సేవలందించాడు.
త్వరలోనే అధికారిక ప్రకటన..
'ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవి కోసం సితాన్షు కోటక్ పేరును పరిశీలించాం. ఫిబ్రవరి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతోనే అతను బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయమై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. గత రెండు సిరీస్‌ల్లో టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సీనియర్లు కూడా బ్యాటింగ్‌లో తడబడుతున్నారు. బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.'అని ఓ అధికారి పేర్కొన్నాడు.
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తుండగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ పనిచేస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్, అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటేలు ఉన్నారు. అభిషేక్ నాయర్ రోల్ బ్యాటర్లకు అండగా ఉండటమేనని, గంభీర్ స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్‌ను తీసుకోలేదు. దాంతో విక్రమ్ సింగ్ రాథోడ్ అనంతరం టీమిండియాకు స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్ లేకుండా పోయాడు.