'సేనురన్ ముత్తుసామి'.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మారుమోగుతున్న పేరు. భారత్‌తో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా గెలుపు ఆశలను చిదిమేసాడు. టెయిలెండర్ల సాయంతో అద్వితీయమైన భాగస్వామ్యాలను నమోదు చేసి సౌతాఫ్రికాకు 489 పరుగుల భారీ స్కోర్ అందించాడు.
206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కైల్ వెర్రెన్‌తో ఏడో వికెట్‌కు 88 పరుగులు జోడించిన ముత్తుసామి.. మార్కో జాన్సన్‌తో కలిసి 9వ వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. అతని పవర్‌ఫుల్ డిఫెన్స్‌కు భారత బౌలర్లు తేలిపోయారు. కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ సాధించడంతో పాటు భారత బౌలర్లను చెడుగుడు ఆడిన ఈ ముత్తుసామి గురించి తెలుసుకునేందుకు భారత అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

భారత సంతతికి చెందిన సేనురన్ ముత్తుసామి సౌతాఫ్రికాలోని నటల్ ప్రావిన్స్‌లోని డర్బన్‌లో 1994 ఫిబ్రవరి 22న జన్మించాడు. ముత్తుసామి పూర్వీకులది తమిళనాడులోని నాగపట్టినమ్. ఇప్పటికీ అతనికి అక్కడ బంధువులున్నారు. క్లిఫ్టన్ కాలేజీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ముత్తుసామి.. క్వాజులు-నాటల్ యూనివర్సిటీ నుంచి సోషల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. మీడియా, మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ కోర్స్ చేశాడు. పాఠశాల స్థాయిలోనే ముత్తుసామి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.
అండర్-11 స్థాయి నుంచి అండర్ 19 వరకు క్వాజులు నాటల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరంభంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు అతను సంశయించాడు. కానీ అతని నిలకడైన ప్రదర్శనతో సౌతాఫ్రికా అండర్ 19 జట్టులో అవకాశం లభించింది. 201-16 సీజన్‌లో డాల్ఫిన్ టీమ్ తరఫున టాపార్డర్ బ్యాటర్‌గా ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
2017లో నైట్స్ టీమ్‌పై 181 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆ జోరును ముత్తుసామి ఎక్కువ కాలం కొనసాగించలేదు. బ్యాటింగ్ ప్రదర్శన తగ్గినా బౌలింగ్‌లో సత్తా చాటాడు. దాంతో అతను ఆల్‌రౌండర్‌గా అవతారమెత్తాడు. నిలకడైన ప్రదర్శనతో 2019లో భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా జట్టులో అవకాశాన్ని అందుకున్నాడు. ఆ పర్యటనలో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో ముత్తుసామి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
ఈ మ్యాచ్‌లో అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ కేశవ్ మహరాజ్ అత్యుత్తమ ప్రదర్శనతో తుది జట్టులో చోటును పదిలం చేసుకోవడంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ముత్తుసామికి ఎక్కువగా అవకాశాలు లభించలేదు. అయినప్పటికీ పట్టువదలని ముత్తుసామి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభను చాటుకున్నాడు. తాజా మ్యాచ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. ఔటాఫ్ సిలబస్‌లా వచ్చి సెంచరీ బాదిన ముత్తుసామిని చూసి భారత బౌలర్లు షాకయ్యారు.