Saurabh Netravalkar: పాక్‌ను ఓడించిన ముంబై సాఫ్ట్‌వేర్!
'సౌరభ్ నేత్రావల్కర్'.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ అమెరికా పేసర్.. పటిష్టమైన పాకిస్థాన్‌ను మట్టికరిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. సూపర్ ఓవర్‌కు దారితీసిన పాకిస్థాన్ వర్సెస్ అమెరికా లీగ్ మ్యాచ్‌లో సౌరభ్ సంచలన ప్రదర్శనతో తన జట్టుకు విజయాన్నందించాడు.
సౌరభ్ నేత్రావల్కర్ భారత్‌కు చెందినవాడు కావడంతో అతని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. దాంతో అతని పేరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..
భారత్‌కు చెందిన సౌరభ్ నరేశ్ నేత్రావల్కర్ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ముంబైకి చెందిన అతను 1991 అక్టోబర్ 16న జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకున్న అతను ఈ ఆటనే కెరీర్‌గా ఎంచుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అండర్ 19 ప్రపంచకప్ 2010లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుత టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, సందీప్ శర్మలతో కలిసి సౌరభ్ ఆడాడు. ఆ టోర్నీ అనంతరం ముంబై తరఫున రంజీ క్రికెట్ కూడా ఆడాడు. తీవ్రమైన పోటీ కారణంగా అతనికి సరైన అవకాశాలు రాలేదు.

మాస్టర్స్ కోసం వెళ్లి..
దాంతో చదువుపై ఫోకస్ పెట్టిన అతను 23 ఏళ్ల వయసులో మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయిన అతను.. అక్కడి స్థానిక టోర్నీలు ఆడి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సౌరభ్.. యూఏఈతో తొలి మ్యాచ్ ఆడాడు. అమెరికాకు సారథ్యం కూడా వహించాడు. ఇప్పటి వరకు ఆ జట్టు తరఫున 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

పాక్‌పై ప్రతీకారం..
టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్‌తో తలపడటం అమెరికాకు ఇదే తొలిసారి. కానీ సౌరభ్ నేత్రావల్కర్‌కు మాత్రం రెండోసారి. టీమిండియా తరఫున అండర్ 19 ప్రపంచకప్ 2010లో బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్‌తో సౌరభ్ తలపడ్డాడు. ఆ టోర్నీలో భారత్ ఓడగా.. తాజా విజయంతో సౌరభ్ నేత్రా ప్రతీకారం తీర్చుకున్నాడు.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరభ్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. తొలి మూడు ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాడు. పైచదవుల కోసం అమెరికాకు వచ్చిన తాను మళ్లీ క్రికెట్ ఆడుతానని ఊహించలేదని సౌరభ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతను ఒరాకిల్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అతని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ నెట్టింట వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications