
దాదాకు ఇష్టం లేకున్నా..
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కొనసాగేందుకు సౌరవ్ గంగూలీ ఆసక్తి కనబర్చినా... బోర్డు సభ్యులు అంగీకరించలేదు. అప్రతిష్టపాలు చేయడం తప్పా ప్రెసిడెంట్‌గా బోర్డుకు చేసిందేం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వరుసగా రెండోసారి బీసీసీఐ పదవిని ఒకరికే ఇచ్చే సంప్రదాయం బోర్డులో లేదని కూడా బోర్డు సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం.
దాంతో గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఐపీఎల్ ఛైర్మన్ పదవిని బోర్డు సభ్యులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పదవిని దాదా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేసినట్లు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజీవ్ శుక్లా తెలిపాడు.

ప్రపంచకప్ హీరో...
దాంతో రోజర్ బిన్ని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డే మ్యాచ్‌లాడిన రోజర్ బిన్నీ.. టెస్టుల్లో 47 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు పడగొట్టాడు. 1983 వరల్డ్‌కప్‌లో రోజర్ బిన్నీ కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చి.. భారత్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన రోజర్ బిన్నీ 18 వికెట్లు పడగొట్టాడు.

కోడుకు కోసం కీలక పదవి..
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా 2012 నుంచి 2015 వరకు రోజర్ బిన్నీ పనిచేశాడు. కానీ అతని కొడుకు స్టువర్ట్ బిన్నీ భారత్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో.. చాలా మంది పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో కొడుకు కెరీర్ కోసం సెలెక్షన్ కమిటీ నుంచి రోజర్ బిన్నీ వైదొలిగాడు. ఆ తర్వాత మళ్లీ బీసీసీఐలో ఏ పదవి చేపట్టలేదు. ఇక భారత్ తరఫున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడిన స్టువర్ట్ బిన్నీ 2021లో రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

కర్ణాటక అధ్యక్షుడిగా..
క్రికెట్ వ్యవహారాల్లోనూ 67 ఏళ్ల రోజర్ బిన్నీకి అపార అనుభవం ఉంది. అతను సుదీర్ఘకాలంగా కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ (కేఎస్‌సీఏ)లో వివిధ బాధ్యతల్ని నిర్వర్తించాడు. 2019 నుంచి కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ కొనసాగుతున్నాడు. వివాదరహితుడైన రోజర్ బిన్నీ ఎంపికని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ సౌరవ్ గంగూలీని అవమానిస్తూ బోర్డు నుంచి వెలుపలికి పంపించడంపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications












