ప్రఫుల్ హింగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) యువ పేసర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే.. తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.
రెండో బంతికే రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, ఇన్ ఫామ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని క్యాచ్ ఔట్ చేసిన ప్రఫుల్ హింగే.. నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను క్యాచ్ ఔట్ చేసి సరికొత్త చరిత్రను లిఖించాడు.
అరంగేట్రంలోనే తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన ఏకైక పేసర్‌గా నిలిచాడు. తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(4)ను కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఈ యువ పేసర్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. ఈ కుర్రాడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ప్రఫుల్ హింగే 2002 జనవరి 18న జన్మించాడు. అందరి పిల్లల్లానే తన ఇంటి పక్కన ఉన్న మైదానంలో ప్రఫుల్ హింగే క్రికెట్ ఆడేవాడు. ఆరంభంలో ప్రఫుల్ హింగేను క్రికెట్ ఆడకుండా తన తండ్రి అడ్డుకున్నాడు. కానీ అతని 12 ఏళ్ల వయసులో సమ్మర్ క్యాంప్ ట్రయల్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ప్రోత్సహించాడు.
13 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ హింగే తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. సైకిల్‌పై ప్రాక్టీస్‌కు వెళ్తూ తరచుగా స్కూల్‌కు లేట్‌గా వెళ్లేవాడు. 16 ఏళ్ల వయసులో కోచ్ సంజీవ్ ఆధ్వర్యంలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేరడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది.
అండర్-19 ట్రయల్స్‌లో 36 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. విదర్భ దేశవాళీ జట్టు తరపున ఆడుతున్న ప్రఫుల్ హింగే.. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. విదర్భ ప్రో టీ20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టు తరపున 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి తన టీమ్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
గతేడాది తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్ ప్రఫుల్ ఐదు వికెట్లతో సత్తా చాటడం చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ ట్రయల్స్‌కు ఆహ్వానించాడు. ట్రయల్స్‌లో ప్రఫుల్ సత్తా చాటడంతో ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ప్రఫుల్ హింగే మైఖేల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన రోల్ మోడల్ ప్యాట్ కమిన్స్‌ను కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'ఐపీఎల్‌కు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా రోల్ మోడల్ అయిన ప్యాట్ కమిన్స్‌ను కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అతని కెప్టెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. కమిన్స్ నుంచి చాలా విషయాలను నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నా. నేను స్టడీస్‌లో కొంచెం వీక్. నా ఫోకస్ అంతా క్రికెట్‌పైనే ఉండేది. నేను ప్రతీ రోజు బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. దాంతో తరుచుగా స్కూల్‌కు ఆలస్యంగా వెల్లేవాడిని.
నా 19 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెటర్ కాగలననే నమ్మకం కలిగింది. అండర్ 19 ట్రయల్స్ ఆడి 36 వికెట్లు తీసాను. కోవిడ్ నా సన్నాహకాలను దెబ్బతీసింది. అప్పుడే ఇంకా కష్టపడాలనే విషయం అర్థమైంది. ఆ తర్వాత అండర్ 23 ఆడాను. MRF పేస్ ఫౌండేషన్‌తో నా బౌలింగ్ మరింత మెరుగైంది. విదర్భ సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ జీవిత ప్రయాణం నాపై తీవ్ర ప్రభావం చూపింది. 'అని ప్రఫుల్ హింగే చెప్పుకొచ్చాడు.