కొలంబో: 'దునిత్ వెల్లలాగే' క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. ఈ 20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో(5/40) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ ఐదు వికెట్లు కూడా టీమిండియా కీలక బ్యాటర్లవి కావడం విశేషం. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలను పెవిలియన్ చేర్చి భారత్ పతనాన్ని శాసించాడు.
80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన టీమిండియాను వెల్లలాగే అతలాకుతలం చేశాడు. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన అతను ముందుగా శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 14వ ఓవర్లలో సెంచరీ హీరో విరాట్ కోహ్లీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 16వ ఓవర్‌లో హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు.

దాంతో 11 పరుగుల వ్యవధిలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం కీలక భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఇషాన్-రాహుల్ జోడీని విడదీసాడు. కేఎల్ రాహుల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తద్వారా భారత టాప్-4 బ్యాటర్లను పెవిలియన్ చేర్చిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఆ కొద్దిసేపటి హార్దిక్ పాండ్యాను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఈ ప్రదర్శనతో హీరోగా మారిన దునిత్ వెల్లలాగే పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. అతని బ్యాక్ రౌండ్ తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. 'ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్'అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఇక 2003లో కొలంబోలో జన్మించిన వెల్లలాగే సెయింట్ జోసెఫ్ కాలేజీలో విద్యను పూర్తి చేశాడు. గతేడాది పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఒకే ఒక టెస్ట్ పాకిస్థాన్‌తో ఆడిన వెల్లలాగే.. మూడు ఫార్మాట్లలో కలిసి 16 వికెట్లు తీసాడు.
శ్రీలంక అండర్ 19 ప్రపంచకప్‌కు సారథిగా వ్యవహరించిన వెల్లలాగే.. స్కాట్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్‌లో అతనే టాప్ పెర్ఫామర్. మొత్తం 17 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో 264 పరుగులు చేసి శ్రీలంక తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సౌతాఫ్రికాపై 113 పరుగులతో సత్తా చాటాడు.