
అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన...
29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న లక్నో ఇన్నింగ్స్‌ను సీనియర్ ఆల్‌రౌండర్ దీపక్ హుడాతో కలిసి ఈ కుర్రాడు చక్కదిద్దిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 14 ఓవర్ల పాటు నిలకడగా ఆడిన బదోనీ.. దీపక్ హుడాతో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. ఇక గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన 15 ఓవర్‌లో 6, 4, 4 హ్యాట్రిక్ బౌండరీలతో విరుచుకుపడి హాఫ్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 41 బంతులు ఆడిన బదోనీ.. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 54 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు.

360 డిగ్రీలు బాదుతాడు..
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ఈ కుర్రాడి ఆటకు ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అతను లక్నో బేబీ ఏబీ అని ప్రశంసించాడు. చూడటానికి చిన్న పిల్లాడిలా ఉన్నా బంతిని 360 డిగ్రీలు బాదుతాడని చెప్పాడు. 'ఆయూష్ బదోని లక్నో బేబీ ఏబీ. తొలి రోజు అతను ఆడిన తీరు అసాధారణం. పైకి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు.. కానీ అతను బంతిని 360 డిగ్రీల్లో బాదగలడు'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

రూ.20 లక్షలకే..
ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షల కనీస ధరకు తీసుకుంది. అండర్ 19 క్రికెట్‌లో ఆడిన ఈ 22 ఏళ్ల ఆటగాడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఢిల్లీ నుంచి అండర్ 19 జట్టులోకి వెళ్లిన బదోనీ తనకంటు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అండర్ 19 విభాగంలో.. శ్రీలంక మీద జరిగిన యూత్ టెస్ట్‌లో 185 పరుగులు చేసిన బదోనీ.. ఆ తర్వాత ఆసియా కప్‌లో కేవలం 28 బంతుల్లో 52 పరుగులు సాధించాడు.

వెతికిపట్టిన గౌతం గంభీర్..
అండర్ 19 క్రికెట్ ఆడిన తర్వాత మూడేళ్లు ఎక్కడా కనిపించని బదోనీ.. ఒక్కసారిగా ఐపీఎల్ 2022 తన ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ ఆణిముత్యాన్ని లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ వెతికి తీసుకొచ్చాడు. లక్నో వేదికగా ఏర్పడబోతున్న జట్టు కోసం గౌతం గంభీర్ ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం అన్వేషణ సాగించాడు. ఈ క్రమంలో అతనికి బదోనీ దొరికాడు. అతని ప్రతిభను గుర్తించిన గంభీర్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అతనికి అవకాశం ఇవ్వడంతో పాటు కృనాల్ పాండ్యా కన్నా ముందే బ్యాటింగ్‌కు పంపించాడు.

గంభీర్ భయ్యనే తీసుకొచ్చాడు..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన బదోనీ.. గంభీర్ వల్లే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పాడు. 'నన్ను గౌతమ్ భయ్యానే తీసుకొచ్చాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి కాకుండా.. నీ ఆట నువ్వు ఆడుకో చాలని చెప్పాడు. నీ న్యాచురల్ గేమ్ ఎలా ఆడతావో ఐపీఎల్‌లో కూడా అలానే ఆడమని గౌతమ్ భయ్యా అన్నాడు.. అందుకే నిన్న మ్యాచ్‌లో నాలానే ఆడాను.
ఐపీఎల్‌లో రావడానికి గత రెండు, మూడు సంవత్సరాలుగా వేలంలో నమోదు చేసుకున్నా.. కానీ ఎవరూ కొనుగోలు చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి రుణపడి ఉంటా.. కృనాల్ పాండ్యా కన్నా ముందే బ్యాటింగ్‌కు దిగుతానని అస్సలు ఊహించలేదు'అని ఆయుష్ బదోనీ సంతోషం వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












