WTC Final: భారత జట్టులోకి నయా పేసర్.. కనివిని ఎరగని ఈ అర్జాన్ నాగ్వాస్‌వాలా ఎవరు?

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఈ టీమ్‌కు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది. పృథ్వీషా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌కు చుక్కెదురైంది. కానీ ఈ 24 మందితో కూడిన జట్టులో ఒక పేరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతని పేరు ఇప్పటివరకు కనివిని ఎరగలేదు. జట్టులో అతని పేరు చూసిన అభిమానులంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అతనే అర్జాన్ నాగ్వాస్‌వాలా.!

ఎవరీ అర్జాన్ నాగ్వాస్‌వాలా?
భారత సెలెక్టర్లు ప్రకటించిన స్టాండ్ బై ఆటగాళ్లలో అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జాన్ నగ్వస్వల్లా ఉన్నారు. ప్రసిద్, ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ ద్వారా అందరికీ సుపరిచితమే. కానీ అభిమన్యు ఈశ్వరన్, అర్జాన్ ఇప్పటివరకు లీగ్‌లో ఆడలేదు. వీరిద్దరూ దేశవాళీలో మాత్రం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈశ్వరన్ బెంగాల్ తరఫున బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తుండగా అర్జాన్ గుజరాత్ లెఫ్టార్మ్ పేసర్‌గా సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్ ఆడకుండానే భారత జట్టులో చోటు దక్కించుకున్న అర్జాన్ గురించి తెలుసుకుందాం.

41 వికెట్లతో..
అర్జాన్ నాగ్వాస్‌వాలా.. అక్టోబర్ 17, 1997లో గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 23 ఏళ్లు. దేశవాళీ టోర్నీల్లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అర్జాన్ లెఫ్టార్మ్ మీడియం పేసర్. ఫాస్ట్ బౌలింగ్ దళానికి అతను మంచి బ్యాకప్ ఆప్షన్. 2018లో బరోడాతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో అతను దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే యూసఫ్ పఠాన్ లాంటి బిగ్ వికెట్ దక్కించుకున్నాడు. 16 మ్యాచ్‌లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్లు సాధించాడు.
అలాగే ఓ మ్యాచ్‌లో 10 వికెట్లూ కూడా పడగొట్టాడు. 2019-20 రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న ఏకైక 'పార్సీ' ఆటగాడు అతనే కావడం విశేషం.

ఔటాఫ్ సిలబస్ బౌలర్‌లా..
ఇంగ్లండ్‌లో పేస్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. అర్జాన్ ఇప్పటివరకు ఐపీఎల్లో కానీ టీమిండియా తరఫున కానీ ఆడలేదు. అందువల్ల అతని బౌలింగ్ సరళి ప్రత్యర్థికి తెలిసే అవకాశం లేదు. అతన్ని ఔటాఫ్ సిలబస్‌లా వాడుకోవచ్చనేది టీమిండియా వ్యూహం. కానీ అర్జాన్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గానే ఎంపిక చేశారు. ఒకవేళ తుదిజట్టులో చోటు దక్కితే అతని ప్రదర్శన కోసం కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ టూర్‌లో జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే టీమిండియా... ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పోటీపడుతుంది.

భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్దీమాన్ సాహా(ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి).
స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్‌వాలా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications