టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కాకుండా తన హాస్య చతురతతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా భారత్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(269, 161) సంచలన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న గిల్.. నా ఫేవరేట్ జర్నలిస్ట్ ఎక్కడా? అంటూ ఓ రిపోర్టర్‌ను ఆడుకున్నాడు. తన ఎకసెక్కాలతో నవ్వులు పూయించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఓ ఇంగ్లీష్ జర్నలిస్ట్.. ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా భారత్‌కు చెత్త రికార్డ్ ఉందని, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని గుర్తు చేశాడు. బుమ్రా లేకుండా ఈ మ్యాచ్ ఆడటంతో టీమిండియా గెలుపుపై సందేహాలు వ్యక్తం చేశాడు. విజయం తర్వాత పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శుభమ్ గిల్.. ఆ జర్నలిస్ ఎక్కడా? అంటూ ప్రశ్నించాడు. అతను కనిపించకపోవడంతో నవ్వుతూ.. 'నా ఫేవరేట్ జర్నలిస్ట్ కనిపించడం లేదు? ఎక్కడ ఉన్నాడు అతను? ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ రికార్డు గురించి అడిగిన సదరు వ్యక్తిని చూడాలని ఉంది' అని అన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
'నేను ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందే చెప్పాను. గత చరిత్ర, రికార్డులను అస్సలు నమ్మను. గత 56 ఏళ్లుగా మేం ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడాం. వివిధ జట్లు ఇక్కడకు వచ్చాయి. అయితే ఈ 9 జట్లలో మాదే అత్యుత్తమమైన జట్టు అనేది నా నమ్మకం. ఇంగ్లండ్‌ను ఓడించి.. సిరీస్ గెలిచే సామర్థ్యం మాకు ఉంది. మేం సరైన నిర్ణయాలు తీసుకొని, ఇదే జోరును కొనసాగిస్తే.. మాకు ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.'అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

'మాకు అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. మేం ఎక్కడైనా 20 వికెట్లు తీయగలం. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండు వైపుల నుంచి నిలకడగా బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. ఫ్లాట్ వికెట్‌పై బంతి సాఫ్ట్‌గా అయిన తర్వాత పరుగులు ఆపడం కష్టం. బంతి గట్టిగా ఉన్నప్పుడే వికెట్లు సులభంగా వస్తాయి. కొత్త బంతితో వేసిన రెండో స్పెల్ మ్యాచ్‌ను మా వైపు మార్చేసింది.'అని గిల్ చెప్పుకొచ్చాడు. తన బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందిస్తూ.. ఐపీఎల్ చివరి దశలోనే బ్యాటింగ్ స్కిల్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు గిల్ తెలిపాడు. 'బయటి వ్యక్తుల విమర్శలు, సూచలనలను మేం పట్టించుకోం. ప్రతీ మ్యాచ్‌కు అభిప్రాయాలు మారిపోతుంటాయి. సహచర ఆటగాళ్లను నమ్మడం ముఖ్యం.'అని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)
భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్‌మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 271 ఆలౌట్( జెమీ స్మిత్ 88, ఆకాశ్ దీప్ 6/91)