బ్యాట్‌తో జహీర్ రాణించిన వేళ..
2007-08 ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన ఏడో వన్డేలో ఈ అద్భుతం జరిగింది. ఓడాల్సిన మ్యాచ్‌లో టెయిలండర్ల అసాధారణ ఆటతో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ సూపర్ విక్టరీని అందుకుంది. ఎంత అద్భుత విజయం అంటే.. ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు, అభిమానులు వరల్డ్ కప్ గెలిచామనేంత సంతోషంలో సంబరాలు చేసుకునేంత. అవును.. దాదాపు ఓటమి ఖాయమనుకున్న ఆ మ్యాచ్‌లో జహీర్ ఖాన్ అద్భుతం సృష్టించాడు. మురళి కార్తీక్ సాయంతో చిరస్మరణీయ విజయాన్నందించాడు.

మురళీ.. సిక్సర్!
రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. మురళి కార్తీక్(6/27) బంతితో చెలరేగడంతో ఆసీస్ 41.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో పాంటింగ్(57), మిచెల్ జాన్సన్(24 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఎక్స్‌ట్రాల ద్వారానే 33 పరుగులు వచ్చాయి. ఇక కార్తీక్ తోడుగా ఆర్పీ సింగ్ (2/59), జహీర్ ఖాన్(1/22) ఆసీస్ పతనాన్ని శాసించారు.

క్యూకట్టిన భారత బ్యాట్స్‌మన్
బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ధోనీ సేన.. బ్యాటింగ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. స్వల్ప లక్ష్యమే అయినా.. మంచి ఆరంభాన్ని అందుకోలేక.. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. ఓపెనర్ సౌరవ్ గంగూలీ డకౌట్ అవ్వగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 21 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ వెంటనే దినేశ్ కార్తీక్ కూడా సున్నాకే వెనుదిరగ్గా.. యువరాజ్ సింగ్(15), ధోనీ(5), ఇర్ఫాన్ పఠాన్(0)లు నిరాశపరిచారు. ఆస్ట్రేలియా భీకర బౌలింగ్‌కు చేతులెత్తేసారు.

జహీర్ ఖాన్ సెన్సేషన్‌ల్ బ్యాటింగ్..
ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు రాబిన్ ఊతప్ప(47) పోరాడాడు. హర్భజన్ సింగ్(19) ఇన్నింగ్స్‌ను గాడిన పడేసే ప్రయత్నం చేశాడు. కానీ క్లార్క్ బౌలింగ్‌లో ఊతప్ప బౌల్డ్ అవ్వగా.. హర్భజన్‌ను జాన్సన్ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 143 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చేతిలో రెండు వికెట్లు ఉండగా.. టీమిండియా విజయానికి 51 పరుగులు కావాలి. క్రీజులో జహీర్ ఖాన్, కార్తీక్ ఉన్నారు.
భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ జహీర్, కార్తీక్ అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. 43 బంతులు ఎదుర్కొన్న జహీర్ 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్తీక్ కూడా 34 బంతుల్లో 3 ఫోలర్లు 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రెట్ లీ స్లెడ్జింగ్‌కు దిగినా అదరని జహీర్ అతనికి సిక్సర్‌తోనే సమాధానం ఇచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ విజయంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ హైలైట్స్ ఇప్పటికీ నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి.


Click it and Unblock the Notifications












