ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ సమష్టిగా చెలరేగిన భారత్.. దాయాదీ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్‌తో మ్యాచ్ వద్దనే నిరసనల మధ్యే ఆ జట్టుతో ఆడిన భారత్.. అసాధారణ ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్నందించింది. అనంతరం దేశ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ పాకిస్థాన్ జట్టు పట్ల తమ నిరసనను తెలియజేసింది. పాక్ ఆటగాళ్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితమిచ్చింది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
'పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉంటాం. మా ప్రగాఢ సానుభూతిని తేలియజేస్తున్నాం. అలాగే ఆపరేషన్ సిందూర్‌తో దైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సాయుధ బలగాలకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. వారు మా దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. వారికి ఈ విజయాన్ని అంకితం చేయడానికి ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి లేదు.'అని సూర్య పేర్కొన్నాడు. అంతేకాకుండా బీసీసీఐ, భారత ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ మ్యాచ్ ఆడామని పరోక్షంగా వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌కు పాకిస్థాన్ కనీస పోటీనివ్వలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారత బౌలర్ల ధాటికి పూర్తిగా తడబడింది. ఓ దశలో 100 పరుగులు కూడా చేస్తుందా? అనిపించింది. కానీ షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) దూకుడుగా ఆడి 127 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్నందుకుంది. పాక్ బౌలర్లను భారత బ్యాటర్లు చెడుగుడు ఆడారు. ఈ విజయంతో టీమిండియా సూపర్ 4 బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి ఆ జట్టుతో తలపడే అవకాశం ఉంది. పాకిస్థాన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈని ఓడిస్తే సూపర్ -4 బెర్త్‌ను దక్కించుకుంటుంది. అప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 21(ఆదివారం)న మరో మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే మూడో సారి కూడా తలపడే ఛాన్స్ ఉంది. కానీ ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాక్ ఇప్పటి వరకు ఫైనల్లో తలపడలేదు.