
ఆ క్షణమే నిర్ణయించుకున్నా..
‘నాన్న చనిపోయినప్పుడే గట్టిగా అనుకున్నా. క్రికెటే నా కెరీర్ అని నిర్ణయించుకున్నా. నా ధ్యాసంతా ఆటమీదే మలిచాను. ఎలాగైనా టీమిండియాకు ఆడాలనుకున్నాను. సుదీర్ఘ కాలం ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. జట్టులో చోటు కోల్పోతే ఎలా అనే ఆలోచన కూడా చేయలేదు. నాన్న మరణం నాలో క్రికెట్ ఆడాలనే కసిని పెంచింది.'అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక 2006 డిసెంబర్‌లో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న విరాట్ కోహ్లీకి తన తండ్రి మరణించాడనే విషయం తెలిసిందే. ఇక క్లిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీని హాఫ్ సెంచరీతో గట్టెక్కించి విరాట్ తన తండ్రి అంతక్రియల్లో పాల్గొన్నాడు. ఆ రాత్రి నుంచి తాము ఓ కొత్త కోహ్లీని చూశామని అతని తల్లి మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.

స్పష్టమైన ఆలోచనతోనే..
ఇక ఆస్ట్రేలియాతో తొలి టెస్టు పూర్తయ్యాక తాను భారత్‌కు తిరిగి వచ్చే విషయంపై చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు చెప్పాడు. జనవరిలో తన భార్య అనుష్క శర్మ తొలిసారి బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా ఆమె వద్దే ఉండాలనుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లో ఆ మధుర క్షణాలను కోల్పోకూడదనే భావిస్తున్నట్లు తెలిపాడు. దేశం తరఫున ఆడడానికి ఎంత నిబద్ధతతో ఉంటామో.. ఇది కూడా అలాంటిదేనని అన్నాడు.

జీవితంలో అదో అద్భుతమైన క్షణం..
‘జీవితంలో ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఏదైమైనా ఆ సమయానికి నేను అనుష్కతో ఉండాలనుకున్నాను. తమ తొలి బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 'అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక అజింక్య రహానే కెప్టెన్సీపై స్పందిస్తూ.. ఆ విషయంపైనా ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు. తాను భారత్‌కు తిరిగి వచ్చాక రహానె జట్టు పగ్గాలు చేపడతాడని, అతనికి నాయకత్వం చేయాలంటే ఇష్టమని వివరించాడు. అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడనే నమ్మకం ఉందని కోహ్లీ తెలిపాడు.

ఆటలో క్వాలిటీ తగ్గదు..
భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో కవ్వింపు చర్యలు ఎప్పటిలానే కొనసాగుతాయని, అయితే ఆట విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశాడు. ‘కరోనా మహమ్మారి ఈ ఏడాది మనకు చాలా కొత్త విషయాలు నేర్పించింది. పాత తరహాలో వ్యక్తిగతంగా కొందరి పట్ల ద్వేషం చూపించడంలో అర్థం లేదని అంతా అనుకుంటున్నారు. ఆసీస్ ఆటగాళ్ల వ్యవహార శైలిలో మార్పు రావడంతోపాటు ఐపీఎల్‌లో కలిసి ఆడటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఏదైనా అంతా ప్రొఫెషనల్‌గానే సాగుతుంది. పరుగులు సాధించడంలో, ప్రత్యర్థి వికెట్లు తీయడంలో దూకుడు లోటు ఏమీ ఉండదు కానీ అనవసరపు అంశాలు మాత్రం వడబోసి పక్కన పడేయడం ఖాయం.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
