
ముంబై: క్రీజు బయటకొచ్చి ఆడితే భయంకరమైన బీమర్‌తో తల పగలగొడతానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. 2007లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ఘటన జరిగిందన్నాడు. నాలుగో వన్డే ముందు రోజు డిన్నర్ చేస్తుండగా అక్తర్ తనను కలిసి బెదిరించాడని గుర్తు చేసుకున్నాడు. ఓ స్టాండప్ కమెడియన్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊతప్ప ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
'గువాహటిలో త్వరగా చీకటి పడుతుంది. 34 ఓవర్ల తర్వాత అప్పట్లో పాత బంతితోనే ఆడేవాళ్లం. ఇర్ఫాన్ పఠాన్, నేను క్రీజులో ఉన్నాం. మా విజయానికి 25 బంతుల్లో 12 పరుగులే అవసరం. అక్తర్ నాకు యార్కర్ విసరడం గుర్తుంది. భయంకరంగా వచ్చిన ఆ బంతిని నేను ఆపాను. అది కనీసం 154 కిలో మీటర్ల వేగంతో వచ్చింది. ఆ తర్వాత బంతి లో పుల్‌టాస్.
దాన్ని బౌండరీకి పంపించాను. ఆ తర్వాత మాకో 3-4 పరుగులు కావాలి. షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో క్రీజుదాటి కొట్టే అవకాశం మళ్లీ మళ్లీ రాదనుకున్నా. అతడు లెంగ్త్ బంతి విసిరాడు. నా బ్యాటు అంచుకు తగిలి బౌండరీకి వెళ్లడంతో మేం గెలిచాం.'అని ఊతప్ప గుర్తు చేసుకున్నాడు.
ఆ తర్వాత మొహాలి వేదికగా జరిగిన రెండో వన్డేలో పాక్ విజయం సాధించగా.. కాన్పూర్‌లో జరిగిన మూడో వన్డేను నెగ్గిన భారత్ సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇక గ్వాలియర్ వేదికగా జరిగిన నాలుగో వన్డే ముందు అక్తర్ తన దగ్గరకు వచ్చి బెదిరించాడని ఊతప్ప తెలిపాడు. 'చివరి మ్యాచ్ కోసం గ్వాలియర్ వెళ్లాం. అక్కడ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లమంతా కలిసే డిన్నర్ చేశాం.
కబుర్లు చెప్పుకొన్నాం. షోయబ్ భాయ్ నా వద్దకొచ్చాడు. గువాహటి వన్డేలో బాగా ఆడానని ప్రశంసించాడు. నేను క్రీజు దాటి అతని బౌలింగ్‌ను ఆడానని చెప్పాడు. అయితే మరోసారి అలా ఆడితే బాగుండదని, బహుశా నీ తలకు గురిపెడుతూ ఓ బీమర్ రావొచ్చని బెదిరించాడు. ఆ తర్వాత అక్తర్ బౌలింగ్‌లో క్రీజు బయటకు వచ్చి ఆడేందుకు భయపడ్డాను.' అని ఉతప్ప తెలిపాడు.