టీమ్ సెలెక్షన్‌లో ఓనర్ జోక్యంపై షేన్ వార్న్ సీరియస్! వెళ్లిపోతానంటూ దమ్కీ! ఎప్పుడంటే..?

సిడ్నీ: రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అతని అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. తన మాజీ కెప్టెన్ మరణాన్ని రాజస్థాన్ రాయల్స్ కూడా మరిచిపోలేకపోయింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో అతని సేవలను గుర్తు చేసుకుంటూనే బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో తమ డగౌట్‌లో ఫరెవర్ వార్న్ ఫ్లెక్సీతో ఆయకు ఘన నివాళులర్పించింది. ఆటలోను వార్న్ స్పూర్తిని కనబరుస్తూ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. గుజరాత్ టైటాన్స్‌తో నేడు(ఆదివారం) జరిగే ఫైనల్లో గెలిచి షేన్ వార్న్‌కు టైటిల్‌ను అంకితం చేయాలనుకుంటుంది.

టీమ్ ఓనర్‌కే దమ్కీ..
రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరిన నేపథ్యంలో షేన్ వార్న్ గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. తొలి సీజన్‌లో అసలు అంచనాలే లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టును వార్న్ ఏకంగా విజేతగా నిలపడాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు వార్న్ రచించిన వ్యూహాలు, జట్టు యాజమాన్యంతో నడుచుకున్న విధానం...ఇలా పలు అంశాలపై ఆసక్తికర చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జట్టు ఎంపిక విషయంలో వార్న్ ఎంత నిబద్దతో ఉన్నాడనే విషయాన్నిపంచుకుంటున్నారు.

వార్న్ ఆత్మకథ ‘నో స్పిన్’..
టీమ్ సెలెక్షన్‌లో జోక్యం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బదాలేతో వార్న్ వాగ్వాదానికి కూడా దిగాడట. ఈ విషయాన్ని షేన్ వార్న్ స్వయంగా తాను రాసుకున్న తన ఆటో బయోగ్రఫీ "నో స్పిన్"లో ప్రస్తావించాడు. ఇప్పుడు ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. వార్న్ రాసినదాని ప్రకారం.. ఐపీఎల్ 2008 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ పది రోజుల క్యాంప్ నిర్వహించింది. ఈ క్యాంప్‌లో రవీంద్ర జడేజా, స్వప్నిల్ అస్నోద్‌కర్ షేన్ వార్న్‌ను ఆకట్టుకున్నారు.

ఓ ఆటగాడిని తీసుకోవాలంటూ..
అయితే టీమ్ ఓనర్ మనోజ్ బదాలే.. అసిఫ్ అనే మరో ప్లేయర్‌ను 16 మంది సభ్యులు గల జట్టులోకి తీసుకోమని కోరాడు. అయితే అసిఫ్ ప్రదర్శన షేన్ వార్న్‌ను ఆకట్టుకోలేదు. దాంతో అతను ససేమిరా అన్నాడు. "ఆ ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తీసుకోండి... అయితే నేను మాత్రం మీ జట్టుకు ఆడలేను. మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను" అని చెప్పాడు. దీంతో షాక్ తిన్న మనోజ్ ఆ ఆటగాడిని ఎంపిక చేస్తే నిజంగానే వెళ్లిపోతావా? అని అడిగితే... వెళతాను అంటూ వార్న్ బదులిచ్చాడు.

కనీసం డగౌట్‌లోకి కూడా..
అయితే జట్టులో చేర్చుకోకపోయినా సరే కానీ, కనీసం డగౌట్‌లోకి అనుమతించాలని మనోజ్ రిక్వెస్ట్ చేశాడు. దానికి కూడా వార్న్ ఒప్పుకోలేదు. డగౌట్ ఏరియా చాలా చిన్నగా ఉంటుందని, అతన్ని అనుమతిస్తే ఫేవర్ చేసినట్లు అవుతుందని చెప్పాడు. దీంతో ఆ రోజుకు మిన్నకుండిపోయిన మనోజ్... మరునాడు వార్న్‌కు స్వయంగా ఫోన్ చేసి ఆ ఆటగాడిని ఎంపిక చేయకున్నా ఫరవా లేదని చెప్పాడు. ఈ వివరాలన్ని వార్న్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications