
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. దాయాదీ పాకిస్థాన్ అంటే పులికించిపోయేవాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు బౌలర్లపై విరుచుకుపడేవాడు. ముఖ్యంగా సెహ్వాగ్-అక్తర్ పోరు అభిమానులను ఆకట్టుకునేది. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ అయిన అక్తర్ వేసే రాకాసి బౌన్సర్‌లను సెహ్వాగ్ తెలివిగా అప్పర్ కట్ షాట్స్‌తో బౌండరీలు బాదేవాడు. ఓ దశలో సెహ్వాగ్ అంటే పాకిస్థాన్ గజగజ వణికింది. ముఖ్యంగా 2004 పాకిస్థాన్ పర్యటనలో సెహ్వాగ్ దుమ్మురేపాడు. అతని ధాటికి అప్పటి పాక్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సెహ్వాగ్ మా సింహ స్వప్నమని ప్రకటించాడు. అతన్ని ఔట్ చేస్తే సగం మ్యాచ్ పూర్తయినట్లేనని పేర్కొన్నాడు.
ఇక సెహ్వాగ్ కెరీర్‌లో ముల్తాన్ టెస్ట్ ప్రత్యేకమైనది. ఆ టెస్ట్‌లో సెహ్వాగ్ (375 బంతుల్లో 309) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ ప్రధాన పేసర్ అయిన షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌ను పదేపదే విసిగించాడు. వారి మధ్య జరిగిన నాటి సంభాషణను మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా పంచుకున్నాడు. స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్తర్‌కు సెహ్వాగ్ దిమ్మతిరిగే బదులిచ్చాడన్నాడు.
'ముల్తాన్ టెస్ట్‌లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత షోయబ్ అక్తర్ అతనిపైకి షార్ట్ పిచ్ బాల్స్‌తో దాడి చేశాడు. పదే పదే బౌన్సర్లు సంధించాడు. ఇక సెహ్వాగ్ ప్రతీ షార్ట్ బాల్‌ను డకింగ్( బంతిని వదిలేసి కిందికి వంగడం) చేశాడు. సెహ్వాగ్ తెలివైన వ్యూహానికి చిర్రెత్తుకుపోయిన అక్తర్ దగ్గరకు వెళ్లి.. ఒక్క పుల్ షాట్ ఆడే ప్రయత్నమైనా చేయవచ్చుగా? అని కోరాడు. దానికి సెహ్వాగ్.. అరే అక్తర్.. నువ్వు బౌలింగ్ చేస్తున్నావా? లేక అడుక్కుంటున్నావా? అని దిమ్మతిరిగే బదులిచ్చాడు.'అని మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
సెహ్వాగ్ మెరుపు బ్యాటింగ్‌తో ముల్తాన్ టెస్ట్‌లో భారత్ రెండేరోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆల్ అవుట్ చేసి ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లెర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని తెలిపాడు.