
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. హిట్ మ్యాన్ తన పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇక జట్టులో సహచర ఆటగాళ్లతో చాలా సరదాగా ఉండే రోహిత్ శర్మకు ఓ చెడ్డ అలవాటు ఉంది. అతనికి మతిమరుపుకు ఎక్కువ. తనకు సంబంధించిన వస్తువులను తరుచూ మరిచిపోతుంటాడు. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రోహిత్ మతిమరుపు గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పాస్‌పోర్ట్, వాచ్, మొబైల్, టాబ్లెట్.. వంటి విలువైన, ముఖ్యమైన వస్తువులను రోహిత్ మరిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నాడు. పెళ్లైన కొత్తలో రోహిత్ తన వెడ్డింగ్ రింగ్‌ను కూడా ఓ హోటల్ గదిలో మర్చిపోయాడని తెలిపాడు. '2015 డిసెంబర్లో రితికాను పెళ్లి చేసుకున్న రోహిత్.. పెళ్లైన కొత్తలో వెడ్డింగ్ రింగ్‌ను ఓ హోటల్ గదిలో పెట్టి అలాగే నిద్రపోయాడు. మరుసటి రోజు ఫ్లైట్ అందుకునే క్రమంలో ఆ రింగ్‌ను మర్చిపోయాడు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్ దగ్గర ఆ రింగ్‌ను చూసిన అతన హర్భజన్ సాయంతో ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకున్నాడు.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
ఇక రోహిత్ శర్మ కూడా తన మతిమరుపు గురించి ఓ షోలో చెప్పుకొచ్చాడు. అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోనని, అంతేకాకుండా ఆలస్యంగా లేచే చెడ్డ అలవాటుందన్నాడు. ప్రతీసారి టీమ్ సహచరులు డోర్ కొట్టి టైమ్ అవుతుందని చెబుతారని, ఎయిర్ పోర్ట్, ప్రాక్టీస్ సెషన్‌కు వెళ్లాలనే ఆతృతలో విలువైన వస్తువులు మరిచిపోతానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ రింగ్ కూడా మర్చిపోయినట్లు ఒప్పుకున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రోహిత్, కోహ్లీ.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సమయాత్తం అవుతున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.