హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత సాధారణ జీవితం గడిపేందుకు మహీ ఇష్టపడుతుంటాడు. టీమిండియాకు మూడు టైటిళ్లు అందించినా.. వరల్డ్ బెస్ట్ కెప్టెన్‌గా అందరి ప్రశంసలు అందుకున్నా.. వేల కోట్లు సంపాదించినా ధోనీ ఎప్పుడూ అహం ప్రదర్శించలేదు. తన మూలలను మరవలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు.
తాజాగా టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోనీ సింప్లిసిటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్న ఎమ్మెస్కే.. ఇప్పటికీ అతను గాజు గ్లాసులోనే టీ తాగుతాడని తెలిపాడు. అలా గాజు గ్లాసులో తాగినప్పుడల్లా తాను ఎక్కడి నుంచి వచ్చానన్నది గుర్తొస్తుందని తనకు ధోనీ తెలిపాడని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా జట్టు కోసం ధోనీ ఎంతటి రిస్క్ అయినా చేస్తాడని, తాను సెలెక్టర్‌గా ఉన్నప్పుడు వెన్నునొప్పిని లెక్క చేయకుండా మ్యాచ్ ఆడాడని తెలిపాడు. టీమిండియా విజయం కోసం తాను ఒంటి కాలితోనైనా ఆడుతానని ధోనీ తనతో అనేవాడని గుర్తు చేసుకున్నాడు.
'నేను టీమిండియా సెలెక్టర్‌గా ఎంపికైనప్పుడు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాను. సెలెక్టర్‌గా అదే నా ఫస్ట్ అసైన్‌మెంట్. నేను విమానాశ్రయంలో దిగగానే మీడియా నన్ను చుట్టు ముట్టింది. ధోనీ గురించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రశ్నలతో నేను అవాక్కయ్యాను. విమాన ప్రయాణంతో అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు.
దాంతో మీడియాను హోటల్‌కు రావాలని చెప్పి వారి నుంచి తప్పించుకున్నాను. టీమ్ హోటల్ దగ్గరకు వెళ్లగానే రవిశాస్త్రి దగ్గరకు వెళ్లి ఏం జరిగింది రవి భాయ్, మీడియా నన్ను చుట్టుముట్టిందని అడిగాను. అప్పుడు ధోనీ రాత్రిపూట జిమ్ చేస్తూ పడిపోవడంతో వెన్నునొప్పికి గురయ్యాడని తెలిసింది. రెండ్రోజుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంది.
నాకేం చేయాలో అర్థం కాలేదు. చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాను. అతను నన్నే నిర్ణయం తీసుకోమన్నాడు. ధోనీని అడిగితే అతను కూల్ ఉండమని చెబుతున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక బ్యాకప్ కీపర్‌గా పార్థివ్ పటేల్‌ను పిలిపించాను. కానీ, ధోనీ మాత్రం ఎలాంటి గాభరా పడలేదు. శరీరంపై లెదర్ బెల్టులు కట్టుకొని ఆరోజు మ్యాచ్‌కు సిద్దమయ్యాడు.
అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నిన్నగాక మొన్న సెలెక్టర్ అయిన నీకే ఇంత టెన్షన్ ఉంటే.. కెప్టెన్‌గా నాకు ఎంత ఉండాలి. టీమిండియా విజయం కోసం ఒంటి కాలితో ఆడటానికైనా నేను సిద్దమని నాతో అన్నాడు. అప్పుడే ఛాంపియన్లు అంటే ఇలాగే ఉంటారనే విషయం అర్థమైంది. ఆ తర్వాత ఓసారి ధోనీ ఇంటికి వెళ్లాను.
ఎవరూ పెద్దగా మాట్లాకపోవడంతో నేను అతని తండ్రిని కదిలించాను. ధోనీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు? అతనిలో ఏమైనా మార్పు ఉందా అని అడిగాను. ధోనీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ అలానే ఉంటాడు బెటా అని బదులిచ్చాడు. వెంటనే నీకు ఏం ఇష్టమని అడిగాడు. నేను టీ అని చెప్పాను.

అనంతరం నాలుగేళ్ల క్రితం ఓరోజు జార్ఖండ్‌లో ధోనీ ఫామ్ హౌజ్‌కు వెళ్తే.. నాకు టీ ఇష్టమనే విషయాన్ని గుర్తు పెట్టుకొని తెప్పించాడు. మా అందరికీ అందమైన కప్పుల్లో టీ ఇచ్చాడు. అతను మాత్రం చాయ్‌బండివారిచ్చే గాజు గ్లాసులో తాగాడు.
ఎందుకు గాజు గ్లాసులో తాగుతున్నావు అని ధోనీని అడిగితే.. ఈ గాజు గ్లాసులో తాగిన ప్రతిక్షణం నేను ఎక్కడి నుంచి వచ్చానన్నది గుర్తొస్తుంది అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు నన్ను కట్టిపడేసాయి'అని ఎమ్మెస్కే ధోనీ గురించి చెప్పుకొచ్చాడు.